: కండోమ్ తో శృంగారం సురక్షితమేనా?
సుఖవ్యాధులు, అవాంఛిత గర్భం తదితర సమస్యలు రాకుండా ఉండడానికి, సురక్షిత శృంగారం కోసం కండోమ్ లను వాడాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ 'నిరోధ్ లు వాడండి బాబోయ్' అని మొత్తుకోవడం చూస్తుంటాం. కానీ, కండోమ్ లతో కూడా చిక్కుందంటున్నారు పరిశోధకులు. మహారాష్ట్రలోని యశ్వంత్ రావు మోహిత్ కాలేజీ, భారతీ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఒక ప్రొఫెసర్ సహకారంతో ఇటీవలే కండోమ్ లపై పరిశోధన చేశారు. మార్కెట్లో ఉన్న 12 బ్రాండ్ల కండోమ్ లలో మూడింటిలో వ్యాధికారక సూక్ష్మజీవులు ఉన్నట్లు బయటపడింది.
ఈ మూడు రకాల కండోమ్ లు కూడా చౌకగా, స్థానికంగా తయారైనవేనట. ఈ మూడింటిలో ఒక రకానికి ప్రభుత్వం అనుమతి కూడా ఉందని తేలింది. అంతేకాదు, ఆ రకం కండోమ్ లను 'పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్' అనే సంస్థ ఉచితంగా సరఫరా చేస్తుందని గుర్తించారు. కనుక కాస్త నాణ్యమైన కండోమ్ లను వాడడమే శ్రేయస్కరమని పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి.