: విషాదంలో బాలీవుడ్
విలనంటే ఎలా ఉండాలని హిందీ సినీ అభిమానులను ఎవరినైనా అడిగితే ప్రాణ్ లా ఉండాలని చెబుతారు. తెరపై అతని వికృత విన్యాసాలను చూస్తే కథానాయకుడికే కాదు, ప్రేక్షకులకూ మండిపోతుంది. అంతలా విలనిజాన్ని పండించిన ప్రాణ్ మరి లేడన్న నిజం తెలిశాక బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. విలన్లకు గ్రాండ్ ఫాదర్ అనిపించుకున్న ఈ ప్రాణ్ కిషన్ సికంద్ నిన్న రాత్రి ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలియగానే బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
తెరపైనే విలన్ గానీ తెర వెలుపల అతడి సౌహార్ద్రతను తలుచుకుని పలువురు ప్రముఖులు విషణ్ణ వదనులయ్యారు. క్రమశిక్షణకు మారుపేరులా నిలిచారని బిగ్ బి అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకోగా, భారతీయ సినిమా చివరి దిగ్గజం తరలిపోయిందని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఆయన పోషించిన పాత్రలు చరిత్రలో కాంతులీనుతుంటాయని కబీర్ బేడీ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీదేవి తమ సంతాపం తెలియజేశారు.