: ఈ గ్రహం మన భూమిలాగే కనిపిస్తోందట!
మన భూమిని అంతరిక్షం నుండి చూస్తే ఎలా ఉంటుంది.... నీలంగా కనిపిస్తుంది. అయితే ఇలాగే నీలం రంగులో కనిపించే ఒక గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త రకం గ్రహం భూమికి 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఒక తార చుట్టూ పరిభ్రమిస్తోందట.
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోపును ఉపయోగించి హెడ్డీ 189733బి అనే ఒక గ్రహాన్ని పరిశీలించారు. ఇది భూమికి చేరువగా ఉన్న సౌరకుటుంబం వెలుపలి గ్రహాల్లో ఒకటి. ఈ గ్రహంపై పగటి ఉష్ణోగ్రత 1093 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుందని, గాజు వర్షం కురుస్తుంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఫ్రెడ్రిక్ పాంట్ చెబుతున్నారు. ఇలా సౌరకుటుంబం వెలుపల ఉండే ఒక గ్రహం రంగును గుర్తించడం అనేది ఇదే మొదటిసారి. ఈ కొత్తగ్రహం తన మాతృతార ముందునుండి వెళ్లేటప్పుడు దీన్ని చూడవచ్చు, ఆ సమయంలో కాంతివర్ణంలో వచ్చే తేడాలను శాస్త్రవేత్తలు కొలిచారు. నక్షత్రం ముందునుండి గ్రహం వెళ్లేటప్పటికన్నా నక్షత్రం వెనక్కి వచ్చిన తర్వాత కాంతి తీవ్రత తగ్గడంతోపాటు దాని వర్ణం కూడా స్వల్పంగా మారుతున్నట్టు, నక్షత్రం వెనక్కి వెళ్లిన సమయంలో అదృశ్యమైన రంగు నీలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.