: డెంగీ జ్వరానికి చెక్ చెప్పవచ్చు
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో డెంగీ జ్వరం ఒకటి. ఏటా ఈ డెంగీ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఐదు కోట్లమంది డెంగీ జ్వరం బారిన పడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇప్పుడు ఈ డెంగీ వైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు ఒక కొత్తరకం చికిత్సను శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ చికిత్స డెంగీ వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చైనా శాస్త్రవేత్తలు డెంగీ జ్వరానికి కారణమవుతోన్న వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చికిత్సను అభివృద్ధి చేశారు. కృత్రిమ మైక్రో ఆర్‌ఎన్‌ఏలను ఉపయోగించి మనుషుల్లో డెంగీ వైరస్ పునరుత్పత్తిని నిలిపివేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ వైరస్ పునరుత్పత్తి నిలిపివేయడానికి వీరు ముందుగా ఈ వైరస్ జన్యుక్రమాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కొన్ని ప్రాంతాలు సుదీర్ఘకాలం పాటు ఎలాంటి మార్పులు లేకుండా, ఉత్పరివర్తనాలకు గురికాకుండా ఉంటున్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా గుర్తించారు. ఇలాంటి ప్రాంతాలే లక్ష్యంగా కృత్రిమ ఆర్‌ఎన్‌ఏలను ప్రయోగించి చూసినప్పుడు డెంగీ వైరస్ పునరుత్పత్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.