: బుల్లెట్లతో నా గొంతు నొక్కగలమని భావించారు: పాక్ సాహస బాలిక


తాలిబాన్లు బుల్లెట్లతో శాసించగలమని భావించారని, కానీ, అది తప్పని తాను నిరూపించానంటోంది పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్. ఐక్యరాజ్యసమితిలో ఆమె నేడు ప్రసంగించింది. పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో బాలికల విద్యాహక్కు కోసం పోరాడుతున్న మలాలాపై గతేడాది అక్టోబర్ 12న తాలిబాన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. పాఠశాలకు బస్సులో వెళుతుండగా కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బ్రిటన్ లో చికిత్స పొందిన మలాలా కొద్ది నెలల క్రితమే పాక్ కు తిరిగొచ్చింది. నేడు 16వ పడిలో ప్రవేశించిన ఈ ఉద్యమకారిణి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ, తాలిబాన్లు బుల్లెట్లతో తమ గొంతు నొక్కాలని భావించి భంగపడ్డారని వ్యాఖ్యానించింది.

'వారు నన్నేమీ మార్చలేకపోయారు. లక్ష్యం నుంచి నా దృష్టిని మరల్చలేకపోయారు. అయితే, వారి దాడి అనంతరం నాలో పిరికితనం, నిరాశావాదం చచ్చిపోయాయి. ధైర్యం, సాహసం, కొత్త శక్తి నాలో అంకురించాయి' అని మలాలా వివరించింది. బాలికల సాధికారత కోసం పోరాడుతున్న తన సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ సభలో పాల్గొన్న బ్రిటన్ మాజీ ప్రధాని గోర్డాన్ బ్రౌన్.. మలాలాను 'ధైర్యశాలి'గా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News