: విజయకాంత్ పై హత్యాయత్నం కేసు
తమిళనటుడు, రాజకీయనాయకుడు విజయకాంత్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై దాడి చేసిన ఘటనలో ఆయనపై హత్యాయత్నం ఆరోపణలు వచ్చాయి. తమిళనాడు సీఎం జయలలితపై విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో విజయకాంత్ వాస్తవానికి పది రోజుల కిందటే నాగర్ కోయిల్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఆ రోజు వేరే పని ఉండడంతో ఈ తమిళనటుడు తర్వాతి రోజు న్యాయస్థానానికి వచ్చాడు. ఆ సమయంలో కోర్టులో వేరే కేసుపై వాదోపవాదాలు నడుస్తున్నాయి.
కానీ, విజయకాంత్ తన న్యాయవాదులతో కోర్టు హాల్లో ప్రవేశించడంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్ఞానశేఖరన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మండిపడ్డ విజయకాంత్ వర్గీయులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో బాహాబాహీ వరకు వెళ్ళడంతో న్యాయమూర్తితో పాటు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఈ విషయమై జ్ఞానశేఖరన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నేడు విజయకాంత్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.