: భార్యను బంగారంలో ముంచెత్తిన బీహార్ అధికారి
జీవిత సహచరిపై అమిత ప్రేమ ఆ బీహార్ అధికారిని లంచాల స్వీకరణ దిశగా నడిపించింది. భార్య మోముపై చిరునవ్వు వాడనీయకూడదని కంకణం కట్టుకున్నాడో ఏమో.. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కాడు, ఇష్టం వచ్చినట్టుగా ముడుపులు మేశాడు. లంచం తీసుకున్నప్పుడల్లా భార్యకు బంగారు ఆభరణాలు బహూకరించేవాడు. అలా ఆ సతీమణి ఖాతాలో చేరిన పసిడి వస్తువుల వివరాలు చూస్తే కళ్ళు బైర్లుకమ్మడం ఖాయం.
230 చెవి కమ్మలు, 53 ఉంగరాలు, 36 గాజులు, 6 నెక్లెస్ లు.. అన్నీ కనకమయమే. పాట్నాలోని సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ డిప్యూటీ డైరక్టర్ రాధాకృష్ణ యాదవ్ ఇంటిపై దాడులు చేసిన బీహార్ ఆర్ధిక నేరాల విభాగం అధికారులకు దర్శనమిచ్చిన నగల జాబితా ఇది. వీటి విలువ రూ.38 లక్షలుంటుందని వారు అంటున్నారు. లంచాలు భారీగా తీసుకుని ఉంటాడని, అందుకే ఇవన్నీ కొనగలిగాడని ఆ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.