: 'ఉత్తరాఖండ్' వితంతువులను పెళ్ళాడేందుకు 'డేరా' మతస్థుల సంసిద్ధత


కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడిన జలప్రళయం ఉత్తరాఖండ్ ను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వందలాదిమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోయి వితంతువుల్లా మిగిలారు. ఇలాంటివారు జీవితకాలం వేదనాభరితులై ఉండాల్సిన అవసరం లేదంటున్నారు పంజాబ్ లోని 'డేరా సచ్ఛా సౌదా' మతస్థులు. వరదల కారణంగా భర్తలను కోల్పోయిన మహిళలను వివాహమాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు డేరా మతాధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఓ ప్రకటన చేశారు.

'డేరా' మతాన్ని అనుసరించే 1500 మంది యువకులు ఉత్తరాఖండ్ వితంతువులకు సౌభాగ్యం ప్రసాదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రెండ్రోజుల క్రితం 33 ట్రక్కుల నిండా వరదబాధితుల కోసం సహాయసామగ్రి పంపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాలు వెల్లడించారు.

ముఖ్యంగా అక్కడి దివోలి బ్రహ్మగ్రామ్ అనే ఊరు 'విలేజ్ ఆఫ్ విడోస్' గా మీడియాకెక్కింది. ఈ కుగ్రామంలోని మగవారు వరదలు సంభవించిన రోజున కేదార్ నాథ్ వద్ద ఉపాధి కోసం పనికి వెళ్ళి తిరిగిరానిలోకాలకు పయనమయ్యారు. జలప్రళయం ఆ గ్రామంలోని స్త్రీల పాలిట దుఖఃదాయనిగా మారింది.

ఈ గ్రామంలోని మహిళలను ఆదుకునేందుకు తాము ఏం చేయడానికైనా సిద్దమే అని 'డేరా' అధిపతి గుర్మీత్ చెప్పారు. వారు మరలా పెళ్ళి చేసుకోవాలనుకుంటే వరుడిని వెతికిపెట్టే బాధ్యత తమదే అని, అలాకాకుండా, వారు ఒంటరిగా ఉండదలుచుకుంటే అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News