: తాగుబోతులు నిర్ణయాలు తీసుకోలేరా?
తాగేవారు సమర్ధవంతమైన నిర్ణయాలను తీసుకోలేరట. ఎందుకంటే, తాగుడు అనే దురలవాటు వారి మెదడును నిర్వీర్యం చేయడంతో వారు సమర్ధవంతమైన నిర్ణయాలను తీసుకోలేరని ఒక అధ్యయనంలో తేలింది. పరిశోధకులు పలువురు తాగుడుకు బానిసైన వారిని బాగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగొన్నారట.
వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన బ్రెయిన్ అండ్ మైండ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాగుబోతుల గురించి ఒక అధ్యయనాన్ని చేపట్టారు. మద్యపానం వల్ల మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దిశగా వీరు అధ్యయనాన్ని సాగించారు. వీరి అధ్యయనంలో తాగుడు వల్ల మనిషిలో స్వతహాగా ఉండే ఆటోపైలట్ వ్యవస్థ సరిగా పనిచేయకుండా పోతుందని, దీనితో వీరు నిర్ణయం తీసుకోవడంలో అశక్తత ఆవరిస్తుందని తేలింది. తాగుడు వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని పరిశోధకులు గుర్తించారు. సహజంగా మనుషుల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్పందించే లక్షణం ఉంటుంది. దీనికి కారణం మెదడులో ఉండే ఆటోపైలట్ వ్యవస్థే. అయితే, తాగిన వారిలో ఈ ఆటోపైలట్ వ్యవస్థ సామర్ధ్యం తగ్గుతుందని, దీంతో తాగిన వారు నిర్ణయాలు తీసుకోవడంలో శక్తిని కోల్పోతారని పరిశోధకులు చెబుతున్నారు.