: కేసీఆర్ కు ఉండవల్లి సవాల్
టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ సాయంత్రం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉండవల్లి.. కేసీఆర్ ను దుయ్యబట్టారు. కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తి అని, ఆయన చేతుల్లోకి తెలంగాణ ప్రాంతంపై అధికారం వెళితే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పుకొచ్చారు. తెలంగాణ కావాలనే హక్కు అక్కడి ప్రజలకు ఉందని, కానీ, కేసీఆర్ తిట్లకు భయపడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించలేమని ఉండవల్లి అన్నారు. కేసీఆర్ మాట్లాడే భాష కారణంగా యావత్ తెలంగాణ ప్రజల వైఖరిని తప్పుగా భావించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణపై అవాస్తవాలు చెబుతూ ప్రజలను రెచ్చగొడుతున్న కేసీఆర్.. దమ్ముంటే ఉమ్మడి వేదికపై చర్చకు రావాలని ఈ సందర్భంగా ఉండవల్లి సవాల్ విసిరారు. తెలంగాణపై కేసీఆర్ వాదన తప్పని నిరూపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రుజువుల్లేని లెక్కలు చెబుతూ, అందరినీ కేసీఆర్ మోసం చేస్తున్నారని ఉండవల్లి మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులను దొంగలు, దోపిడీదారులనడం తగదంటూ హితవు పలికారు.
కేసీఆర్ మాటల వల్లే యువకులు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారని ఎంపీ ఆరోపించారు. ఏదేమైనా ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ ఏర్పడదంటూ.. కేసీఆర్ వంటి వ్యక్తుల ఆందోళనల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఉండవల్లి స్పష్టం చేశారు.