: పశ్చిమ బెంగాల్లో కనిపించని సమ్మె ప్రభావం
దేశ వ్యాప్తంగా రెండురోజుల సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం పిలుపునివ్వడంతో మొదటిరోజు ఎక్కడి పనులు అక్కడ స్థంభించి, కార్యాలయాలు బోసిపోయినట్టు కనిపిస్తుంటే.. పశ్చిమ బెంగాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ రాష్ట్రమంతా ప్రశాంతంగా, సాధారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా బెంగాల్ రాజధాని కలకత్తాలో దుకాణాలు, మార్కెట్లు తెరిచే ఉన్నాయి. ప్రైవేటు బస్సులు, టాక్సీలు తక్కువ సంఖ్యలో ఉన్నా, అనేక ఆర్టీసీ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయని పోలీసు వర్గాల సమాచారం.
మరోవైపు హౌరాలో మాత్రం రైళ్లు తక్కువగా తిరుగుతున్నాయి. విమానాల రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సమ్మె కారణంగా సర్కారు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే జీతంలో కోత విధిస్తామని ప్రభుత్వం హెచ్ఛరిక జారీ చేసింది. ఇక షాపులు తెరవకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని ముందుగానే ప్రకటించింది.
అయితే బెంగాల్ ప్రభుత్వం తమ సమ్మెను అప్రజాస్వామికంగా, అన్యాయంగా భావిస్తోందని సీఐటీయూ నేతలు విమర్శించారు. ఇందుకు స్పందించిన సీఎం మమతా బెనర్జీ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటమే తమ బాధ్యత అని చెప్పారు. ఒకవేళ సమ్మె సమయంలో నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్నారు.