: మరోసారి రగులుతున్న సమైక్యాంధ్ర


సమైక్యాంధ్ర ఉద్యమం మరోసారి ఉదృత రూపం దాల్చుతోంది. నేతలు, విద్యార్ధులు, ఉద్యమకారులు రోడ్లెక్కుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, భీమవరం... ఇలా ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా బంద్ లు, ర్యాలీలు, రాస్తారోకోలతో స్థానికులు కదంతొక్కుతున్నారు. నినాదాలతో పరిసరాలను హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని విడదీయడానికి ఒప్పుకునేది లేదని సంతకాలను సేకరిస్తూ మరోసారి ఉద్యమబాట పడుతున్నారు. అందులో భాగంగా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ నేతలతోనూ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నారు.

గతంలో డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సీమాంధ్ర ప్రజలు, నేతలు ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఉద్యమాలు, రాజీనామాలతో ప్రకటన సవరించుకునేలా చేశారు. మరోసారి తెలంగాణ ప్రకటన చేస్తారంటూ ఊహాగానాలు రావడంతో, రాష్ట్రం ముక్కలు కావడానికి వీలులేదంటూ సీమాంధ్రులు నినదిస్తున్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని అలాగే ఉంచాలని, అవసరమనుకుంటే ప్యాకేజీ ఇచ్చినా అభ్యంతరం లేదని చెబుతూ వస్తున్నారు. అయినా సరే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కంకణం కట్టుకున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు.

సీమాంధ్రుల ఉద్యమాలకు దీటుగా ఈసారి పంచాయతీ హస్తినలో జరుగుతోంది. రెండు ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఢిల్లీలలో మోహరించి ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే కేంద్రం ఎటువేపు మొగ్గు చూపుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరికి వారు తమ గళాన్ని విప్పుతున్నారే తప్ప అధిష్ఠానం దూతగా ఏ వ్యాఖ్యా చేయడం లేదు సరికదా, రాష్ట్ర నేతలనే రోడ్ మ్యాప్ అడిగి రాజకీయ చతురత చూపిస్తున్నారు. దీంతో మరోసారి రాష్ట్రం నిప్పుల గుండం కానుందా అని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News