: మూత్రాశయ క్యాన్సర్‌ను ఇట్టే గుర్తుపట్టొచ్చు


ప్రస్తుతం మనుషులను వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. ఇది ఏ శరీర భాగాలకు వ్యాపించినా ఇక నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు పలు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్యాన్సర్లను గుర్తించే విషయంలో బయోమార్కర్లు చక్కగా తోడ్పడుతున్నాయి. అయితే మూత్రాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఇలాంటి బయోమార్కర్లు మాత్రం లేవు. మూత్రాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీంతో నిమిషాల్లో వ్యాధిని గుర్తించొచ్చు అంటున్నారు.

లివర్‌ఫూల్‌, వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం ద్వారా మూత్రాశయ క్యాన్సర్‌ను నిమిషాల్లో గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. మూత్రంలోని కొన్ని వాసనలను గమనించడం ద్వారా మూత్రాశయ క్యాన్సర్‌ను కేవలం 30 నిమిషాల్లోనే నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరానికి ఒడోరీడర్‌ అనే పేరుపెట్టారు. ఈ పరికరం మూత్రంలోని క్యాన్సర్‌ సంబంధిత రసాయనం వాసనను గుర్తించే సుశిక్షితమైన శునకాల ద్వారా ఈ వ్యాధిని కనుగొనవచ్చని గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.

మూత్రంలోని కొన్ని వాయువుల వాసనను పసిగట్టడమే ఈ వ్యాధి నిర్ధారణలో కీలకమని తేలింది. దీని ఆధారంగానే ఒడోరీడర్‌ను పరిశోధకులు తయారు చేశారు. ఈ పరికరంలో ఒక సెన్సర్‌ ఉంటుంది. ఈ సెన్సర్‌ మూత్రం నుండి వెలువడే వాయువులోని కొన్ని రసాయనాలకు సంబంధించి, వాటి వివరాలను అందిస్తుంది. ఈ వివరాల విశ్లేషణ ద్వారా మూత్రాశయంలోని క్యాన్సర్‌ కణాల ఉనికిని గురించి శాస్త్రవేత్తలు గుర్తించేందుకు వీలుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News