: జలియన్ వాలాబాగ్ ఘటన బ్రిటిష్ చరిత్రలో మాయని మచ్చ: కామెరాన్


పంజాబ్ రాష్ట్రం అమృతసర్ లోని జలియన్ వాలాబాగ్ లో నాడు రాక్షసంగా కాల్పులు జరిపి వందలాది ప్రాణాలను బలితీసుకున్నాడు బ్రటిష్ జనరల్ డయ్యర్. ఇది బ్రిటిష్ చరిత్రలోనే అవమానకర ఘటనగా  భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నాటి తప్పును నేడు అంగీకరించారు. 

మూడు రోజుల భారత పర్యటనలో చివరి రోజైన బుధవారం కామెరాన్ అమృత్ సర్ లో జలియన్ వాలాబాగ్, స్వర్ణదేవాలయాలను సందర్శించారు. స్వర్ణ దేవాలయలో ప్రార్థనలు జరిపారు. "జలియన్ వాలాబాగ్ ఘటన బ్రటిష్ చరిత్రలోనే చాలా అవమానకరమైన ఘటన. ఇది చాలా క్రూరమని విన్ స్టన్ చర్చిల్ ఆనాడే చెప్పారు. జరిగిన దానిని మేమెన్నటికీ మరవలేం. శాంతియుత నిరసన ప్రదర్శనల హక్కును సమర్థిస్తాం" అని జలియన్ వాలాబాగ్  సందర్శకుల  పుస్తకంలో కామెరాన్ రాశారు. 

1919 ఏప్రిల్ 13. స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగుతున్న రోజులు. దాంతో ప్రజా సమావేశాలను బ్రిటిష్ పాలకుడు జనరల్ డయ్యర్ నిషేధించాడు. అయినా, 15 నుంచి 20 వేల మంది వరకూ వృద్ధులు, యువకులు, మహిళలు జలియన్ వాలా బాగ్ కోటలో సమావేశం అయ్యారు. ఇది డయ్యర్ కు తెలిసింది. తన బలగాలతో అక్కడకు చేరుకున్నాడు. కాల్పులకు ఆదేశించాడు.

10 నిమిషాల పాటు 50 మంది సాయుధులు విచ్చక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే 379 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి తూటా గాయాలయ్యయి. అయితే, మృతులు వెయ్యి మంది వరకూ ఉంటారని అనధికారిక అంచనా. ఈఘటన జరిగిన 94 ఏళ్ల తర్వాత బ్రిటన్ ప్రధాని నాటి తప్పును అంగీకరించడమే కాక, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న బంధానికి నిదర్శనం. 

  • Loading...

More Telugu News