: నీట మునిగిన టొరంటో నగరం
కెనడాలోని టొరంటో నగరం భారీ గాలివానలో తడిసిముద్దయింది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదనీటిలో నగరం మునిగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ అంతరాయంతో సుమారు మూడు లక్షల మంది ప్రజలు గంటల తరబడి అంధకారంలో గడపాల్సి వచ్చింది. నీరు చేరిపోతోందని సబ్ వేలను అధికారులు మూసివేశారు. విద్యుత్ అంతరాయంతో ఒక రైలు వరద నీటి మధ్యలో ఆగిపోయింది. ఆ సమయంలో ఆ రైలులో 1400 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరంతా కొన్ని గంటల వరకూ బిక్కుబిక్కు మంటూ రైలులో గడిపారు. అయితే రైలు కిటికీల వరకూ నీరు వచ్చిందని ప్రయాణీకులు తెలిపారు. రికార్డు స్థాయిలో టొరంటోలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా పలు విమానాలను రద్దు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నారు.