: సచిన్ తనయుడికి చుక్కెదురు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. స్కూల్ క్రికెట్ లో పరుగులు వెల్లువెత్తించిన ఈ టీనేజర్ ముంబయి అండర్-14 జట్టు ప్రాబబుల్స్ లో స్థానం దక్కించుకోలేకపోయాడు. ముంబయి క్రికెట్ సంఘం నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ లో పేలవ ఫామ్ కనబర్చడమే అర్జున్ పాలిట ప్రతిబంధకంగా మారింది. గత ఏడాది ఇదే జట్టులో సభ్యుడైన సచిన్ పుత్రుడు ఈసారి కనీసం ప్రాబబుల్స్ లోనూ చోటు సాధించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఈ విషయమై ముంబయి క్రికెట్ వర్గాలు స్పందిస్తూ.. ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక చేశామని వెల్లడించాయి. వేసవిలో ముంబయి క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్ లలో అర్జున్ ఒక్క ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదని తెలుస్తోంది.