: సాగర్ నీటి విడుదలపై ఎటూ తేల్చుకోని సర్కారు
వేసవి కాలం రాక ముందే నీటి కడగండ్లు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరికొద్ది నెలల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ప్రస్తుతం అందర్ని వేధిస్తున్న సమస్య. సాగు నీటి కోసం పోరాటాలు, తాగు నీటి కోసం ఇక్కట్లు తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందర ఎన్నో సవాళ్లున్నాయి.
ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 510 అడుగుల మేర నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ నీటిని తాగునీటి కోసం విడుదల చేస్తే వేసవిలో నిల్వలు అడుగంటే ప్రమాదం ఉందని సందేహిస్తున్నారు.
మరోవైపు కృష్ణా డెల్టాకు నీరందివ్వకపోతే మహాధర్నాకు దిగుతామని టీడీపీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులకు సాగునీటి విడుదల కూడా అనివార్యంగా కనిపిస్తోంది. డెల్టాకు నీరందించిన తర్వాత నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో 340 చెరువులకూ నీటిని విడుదల చేయాలి.
నడి వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉండడం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటినే ప్రణాళిక ప్రకారం వినియోగించాల్సి రావడంతో నీరు విడుదల చేసేందుకు సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది.