: రేపే విడుదల... పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్!
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్రవ్యాప్తంగా రేపు జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు 5 నుంచి 15 లక్షల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకాలుగా అందజేస్తుందని రమాకాంత్ రెడ్డి తెలిపారు.
వేలం నిర్వహించిన 4 పంచాయతీలపై కేసులు నమోదు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హైదరాబాద్ లో ఈయన మాట్లాడుతూ రంగారెడ్డి ఉప్పరిగూడ, కరీంనగర్ జిల్లా బస్వాపూర్, తూర్పుగోదావరి జిల్లా పసలపూడి, ప్రకాశం జిల్లా ఓబిన్ పల్లి పంచాయతీలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పంచాయతీలకు వేలంపాటలు నిర్వహిస్తే కేసులు నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే మూడు విడతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్న రాజకీయపార్టీల నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.