: చైనాలో అమ్మ పాలను పిండుకుంటున్న పెద్దోళ్లు!


ఈ సృష్టిలో మానవుడి పుట్టుకకు ఒక ప్రత్యేక నిర్మిత వ్యవస్థ ఉంది. అది భగవంతుడో, మరెవరు ఏర్పాటు చేశారో తెలియదు కానీ, అందులో పరమార్థం దాగుంది. దంపతుల సాంగత్యం... గర్భంలో పిండం, నవ మాసాలు, శిశువు కళ్లు తెరవడం.. అమ్మపాలతోనే ఆ శిశువు నెలలపాటు పెరగడం ఇదంతా ఏర్పాటైన వ్యవస్థ. శిశువుకు తల్లి పాలే ఆరోగ్యం.. అందులో ఎంతో విలువైన, మరే రూపంలోనూ లభించని అద్భుతమైన పోషకాలు ఉంటాయి. మరి శిశువులకు ఆ పాలే లేకుండా చేస్తే.. వారి ఆరోగ్యంలో తప్పకుండా మార్పు ఉంటుంది. ఇప్పుడు చైనాలో అదే జరుగుతోంది.

చైనాలో డబ్బున్న పెద్దోళ్లు ఆరోగ్యం కోసం శిశువులు తాగాల్సిన అమ్మపాలను నోట్ల కట్టలతో పిండేసుకుంటున్నారు. పేద అమ్మలకు డబ్బులను ఎరగా వేసి పోషకాలతో కూడిన అమూల్యమైన పాలను దోచుకెళుతున్న వైనం మనుషులు ఎంతకు దిగజారుతున్నారనే దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. చైనా ప్రపంచంలోనే రెండో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. కానీ, చైనీయులకు ఉండేంత మూర్ఖపు నమ్మకాలు మరెవరికీ ఉండవంటారు. అమ్మపాలను సేవిస్తే సర్జరీ చేయించుకున్నవారు త్వరగా కోలుకుంటారని అక్కడి వారి నమ్మకం. మరెన్నో వ్యాధులు కూడా నయమవుతాయని విశ్వసిస్తారు. అందుకే, సంపన్న చైనీయులు ప్రత్యేకంగా నర్సులను నియమించుకుని బాలింతల కోసం గాలిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన పేద అమ్మలకు నెలకు 2,000 నుంచి 4,000 డాలర్లు (మన కరెన్సీలో 2.4లక్షల రూపాయల వరకు)ఇస్తూ శిశువు తాగాల్సిన పాలను దోచుకెళుతున్నారు. సంపన్నులకు ఇందులో సాయపడడానికి నర్సులను సమకూర్చేందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలు కూడా పుట్టుకొచ్చాయంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది. డబ్బిస్తే చాలు, పెద్దోళ్లు అమ్మపాలను నేరుగా తాగవచ్చు, లేక సిగ్గుగా అనిపిస్తే (ఆ సిగ్గు ఎగ్గే ఉంటే వారెందుకు దిగజారుతారు?) పంపు ద్వారా సేకరించి ఇస్తారట.

ఇలా శిశువుల హక్కు అయిన తల్లిపాలను ఇతరులు దోచుకోవడం అనైతికత అని చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో దీనిపై బ్లాగర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుంది కదాని చిన్నారుల హక్కులను కాలరాసే హక్కు వారికి ఎవరిచ్చారు?

  • Loading...

More Telugu News