: స్నోడెర్న్ కు వెనిజులా ఆశ్రయం
అమెరికా రహస్య నిఘా వ్యవహారాన్ని బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెర్న్ వెనిజులాలో తల దాచుకునేందుకు మొగ్గు చూపుతున్నాడని రష్యాలోని సీనియర్ న్యాయవేత్త తెలిపారు. అమెరికాకు, వెనిజులాకు మధ్య ఉన్న తీవ్రమైన శత్రుత్వం కారణంగా వెనుజులాలో ఆశ్రయానికి స్నోడెర్న్ పచ్చజెండా ఊపాడు. అనుకోని అతిథిగా వచ్చిన స్నోడెర్న్ కారణంగా అంతంత మాత్రంగా ఉన్న అమెరికా, రష్యా సంబంధాలు మరింత పలుచబడ్డాయి. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న అమెరికా రష్యాలు ఈమధ్య కాలంలో తమ మధ్య అగాధాన్ని పూడ్చుకునే పనిలో ఉన్నాయి. ఈ దశలో స్నోడెర్న్ రాక వారి బంధాన్ని బీటలు వార్చింది.
జూన్ 23 న ఆశ్రయం కోరుతూ వచ్చిన స్నోడెర్న్ కు రష్యా విమానాశ్రయంలోనే ఆశ్రయాన్ని కల్పించింది. తాజాగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆశ్రయమిచ్చేందుకు అంగీకరించడంతో స్నోడెర్న్ అటువేపు మొగ్గుచూపుతున్నాడు. రష్యా స్నోడెర్న్ ను సురక్షితంగా వెనిజులా చేర్చనుంది. తాజా పరిణామాల నేపధ్యంలో స్నోడెర్న్ కు ఆశ్రయమిచ్చేందుకు ముందుకు వచ్చిన వెనిజులా నిర్ణయం పట్ల మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.