: లోక్ పాల్ పై విశ్వాసఘాతం... ఏడాది చివర్లో మళ్లీ ఉద్యమం: అన్నా హజారే
లోక్ పాల్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ఎన్డీయేపై ధ్వజమెత్తిన సామాజిక వేత్త అన్నాహజారే, ఈ ఏడాది చివర్లో మరోసారి ఉద్యమిస్తానని ప్రకటించారు. అలహాబాద్ లో విలేకర్లతో మాట్లాడిన హజారే పటిష్ఠ లోక్ పాల్ కు అన్ని చర్యలు తీసుకుంటానని ప్రధాని తమకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారన్నారు. రెండేళ్లయినా లోక్ పాల్ పై ఏ విధమైన పురోగతీ లేదని మండిపడ్డారు. దేశానికి ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ససేమిరా అంటున్న కేంద్రం చర్య నిజంగా విశ్వాసఘాతుకమేనని అన్నా దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని, వచ్చే అక్టోబర్ లేదా నవంబరుల్లో మరోసారి ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ఉద్యమిస్తానని అన్నాహజారే స్పష్టం చేశారు.