: రాజకీయ పార్టీల హామీలకు చట్టం అవసరం: సుప్రీం
గెలుపుకోసం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు లెక్కలేనన్ని హామీలు గుప్పిస్తుంటాయి. అది ఉచితంగా ఇస్తాం.. ఇది ఉచితంగా ఇస్తామంటూ హామీలిచ్చి, తీరా గెలిచాక ఓటర్ల చెవులలో పూలు పెడుతుంటాయి. ఇలాంటి ధోరణిని అరికట్టే దిశగా.. పార్టీల ఉచిత హామీల నియంత్రణకు చట్టం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉచితాలను ప్రకటించడం ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తుందని, ఎన్నికల తీరుకు విఘాతం కలిగిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలతో సంపద్రించి అభ్యర్థుల ప్రవర్తనను క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలను రూపొందించాలని ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది.
తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుత అన్నాడీఎంకే, పూర్వపు డీఎంకే ప్రభుత్వాల ఉచిత పథకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలలో పేర్కొనే ఉచిత పథకాలు ప్రస్తుత చట్టం ప్రకారం అవినీతి కింద రావని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.