: బాగా వినిపించే కొత్త త్రీడీ చెవి
మన చెవికన్నా కూడా చక్కగా వినిపించేలా శాస్త్రవేత్తలు ఒక కొత్త కృత్రిమ చెవిని రూపొందించారు. అయితే ఇది త్రీడీ ప్రింటింగ్ ప్రక్రియలో రూపొందించడం విశేషం. ఈ కృత్రిమ చెవి మనిషి చెవికన్నా కూడా అధిక వినికిడి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఎక్కువ దూరం రేడియో ఫ్రీక్వెన్సీ కలిగివున్న ఈ బయోనిక్ చెవిని ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు.
ప్రిన్స్‌టన్ వర్సిటీకి చెందిన మైఖేల్ మెక్ అల్ఫైన్, నవీన్ వర్మ అనే శాస్త్రవేత్తలు త్రీడీ ప్రక్రియ ద్వారా కణాలను, అతి సూక్ష్మ పరమాణువులను ముద్రించే పరిజ్ఞానాన్ని విజయవంతంగా సాధించారు. దీనితోబాటు కార్టిలేజ్‌తో కూడిన చిన్న కాయిల్ యాంటెన్నా సాయంతో బయోనిక్ చెవిని రూపొందించారు. ఈ కృత్రిమ చెవి నిర్మాణంలో ఎలక్ట్రానిక్స్‌ను, బయోలజీని కలిపి త్రీడీ పద్ధతిలో నిర్మాణాల్ని రూపొందించడంలో వీరు సరికొత్త విధానానికి తెరతీశారు. ప్లాస్టిక్ సర్జరీ, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగాల్లో అత్యంత క్లిష్టతరమైన చెవి పునర్నిర్మాణాన్ని వీరు త్రీడీ ప్రింటింగ్ ప్రక్రియ ద్వారా రూపొందించారు. ఈ ప్రింటర్ ప్లాస్టిక్ మొదలైన కణాల దాకా భిన్నమైన పదార్ధాలను సన్నని పొరల్లాగా ఒకచోట చేర్చి అవసరమైన ఆకృతిని నిర్మిస్తుంది.