: కిక్కిస్తే కరెంటు పుడుతుంది!
మామూలుగా అయితే ఫుట్‌బాల్ ఆట ఆడితే మనకు మంచి శారీరక వ్యాయామం చేసినట్టవుతుంది. అయితే ఈ ఫుట్‌బాల్ ఆడితే మాత్రం చక్కగా లైటు వెలిగించుకోవచ్చు. ఎందుకంటే దీన్ని చక్కగా తంతే ఆ కిక్కులో నుండి కరెంటు పుడుతుందట. ఇలాంటి ఫుట్‌బాల్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు.
నిజానికి మన ఆటల్లో కూడా శక్తి ఉత్పత్తి అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఆ శక్తిని ఒడిసి పట్టడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఒక్క తన్నుతో ఫుట్‌బాల్ నుండి కరెంటును ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం బాల్‌ను తయారు చేశారు. ఈ బంతికి సాకెట్ అనే పేరు పెట్టారు. మామూలు ఫుట్బాల్కన్నా 30 గ్రాముల ఎక్కువ బరువుండే ఈ సాకెట్ బాల్లో మాత్రం గాలి ఉండదు. నీటి ప్రభావాన్ని తట్టుకునే విధంగా ఈ బంతిని ఈవీఏ ఫోమ్‌తో తయారు చేశారు. గతిజ శక్తిని ఉపయోగించుకుని ఈ బంతి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ బంతిలో చిన్న లోలకం ఉంటుంది. ఈ లోలకం బంతి కదలిక వల్ల విడుదలయ్యే శక్తిని గ్రహించి దానికి అనుసంధానంగా ఉన్న జనరేటర్‌ను కదిలిస్తుంది. దీంతో అందులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తు రీఛార్జిబుల్ బ్యాటరీలో నిల్వ ఉంటుంది. ప్లగ్ సహాయంతో మనం ఇలా నిల్వ ఉంచిన విద్యుత్తును అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఈ బాల్‌తో ఓ అరగంటపాటు ఆడితే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో చిన్న ఎల్ఈడీ లైటును మూడు గంటలపాటు వెలిగించుకోవచ్చు. ఈ సాకెట్ బంతి ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని దీన్ని ఉత్పత్తి చేసే ఆన్చార్టెడ్ ప్లే సంస్థ చెబుతోంది.