: ఈజిప్టులో నూటొక్కమందిపై దారుణ అత్యాచారం
ఈజిప్టు రాజధాని కైరోలోని తాహ్రిర్ స్క్కేర్ అంటే అక్కడి రాజకీయనేతలకు హడల్. ఎందుకంటే, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పుడల్లా వారు ఆందోళన ప్రదర్శనలు చేపట్టి, తద్వారా దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేది అక్కడి నుంచే కాబట్టి. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక కూడలి ఇప్పుడు మహిళల పాలిట ప్రమాదస్థలిలా పరిణమించింది. అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిన సమయంలో ఇప్పటివరకు తాహ్రిర్ స్క్వేర్ వద్ద 101 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని మానవ హక్కుల సంఘం ఆరోపించింది.
రాయడానికి వీల్లేని విధంగా వారిపై పైశాచిక మానభంగపర్వం చోటు చేసుకుందని ఓ స్వచ్ఛంద సేవాసంస్థ పేర్కొంది. జూన్ 28 నుంచి జులై 3 మధ్యకాలంలో ఆందోళన చేస్తున్న మహిళలను తీవ్రంగా కొట్టి వ్యాన్ లలో ఎక్కించుకుని తీసుకెళ్ళి మరీ అత్యాచారం చేశారని ఆ సంస్థ వెల్లడించింది. ఇలాంటి ప్రజా ఉద్యమాలకు మహిళలను దూరంగా ఉంచేందుకే కొందరు పనిగట్టుకుని ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' తెలిపింది.