: ఊపిరితిత్తులకు ఊపిరినిచ్చే పసుపు
మన వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే దినుసులు మనకు ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడేవే. అందులో పసుపుకు చాలా సుగుణాలున్నాయి. ఏ చిన్న గాయమైనా వెంటనే పసుపును అద్దితే సరి. అది గొప్ప యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు నెలల తక్కువ పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగా పనిచేయని అపాయకర పరిస్థితుల నుండి కూడా పసుపు చక్కటి రక్షణనిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పసుపు పలు జబ్బులకు ఔషధంలాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే పసుపు ఊపిరితిత్తులకు ఊపిరి ఇవ్వగలదని కూడా తాము నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్ధానికి నెలల తక్కువ పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగా పనిచేయక అపాయకర పరిస్థితి ఏర్పడితే, అలాంటి సమయంలో ఊపిరితిత్తులకు ఊపిరిని అందించగల శక్తి ఉందని తాము నిర్వహించిన పరిశోధనల్లో స్పష్టమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కుర్కుమిన్ అనే పదార్ధానికి వాపును తగ్గించే గుణం ఉందని, ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుందని, హానికారక సూక్ష్మజీవులను పసుపు నశింపజేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.