: దిగ్భ్రాంతి కలిగిస్తున్న మావోయిస్టుల తీరు
మావోయిస్టులు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు దారుణమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. తమ ఉద్యమ పంధాలో ముందుకు సాగేందుకు మావోలు ఎల్టీటీఈ విధానాలను అనుసరిస్తున్నారు. తమ దళాలలోకి అన్నెం పున్నెం ఎరుగని గిరిజన బాలలను చురుగ్గా చేర్చుకుంటున్నారు. బాల పోరాట బృందాలు(బీఏటీ) పేరుతో పలు కేడర్లలో పిల్లలను నియమించుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో బాలికలు కూడా ఉంటున్నట్టు పేర్కొంటున్నాయి. భద్రతా దళాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపడుతుండడంతో యువజనులకు మావో ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొనడం కష్టమైంది. దీంతో మావోయిస్టులు పాఠశాలల పిల్లలను చురుగ్గా ఎంపిక చేసుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా బాలపోరాట బృందాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే, ఈ ప్రక్రియ పిల్లలకు పెను ముప్పని పలు రంగాలకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో బాల సంఘాలు, ఛాత్రా సంఘాల పేరుతో విద్యార్ధి సంఘాలు ఎప్పట్నుంచో ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నాయని రాయ్ పూర్ అదనపు డీజీపీ ఆర్కే విజ్ తెలిపారు. బాలలను చైతన్యవంతం చేసేందుకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మావోయిస్టులు వారిని చేర్చుకుంటూనే ఉన్నారని తాజాగా లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.