: కరవు కాలంలో ఖరీదైన పెళ్లి చేసి... ఐటీ దాడులకు గురైన మహారాష్ట్ర మంత్రి
మహారాష్ట్రలో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక, కరవు కరాళ నృత్యం చేస్తుంటే... ఓ మంత్రి వర్యుడు ఊరూవాడా దద్దరిల్లేలా తన కుమారుడు, కుమార్తె వివాహాలను ఏకకాలంలో జరిపించాడు. చివరికి ఇన్ కమ్ టాక్స్ అధికారులకు టార్గెట్ అయ్యాడు! ఆ మంత్రి పేరు భాస్కర్ జాదవ్. మహారాష్ట్ర మంత్రి వర్గంలో పట్టణాభివృద్ధి శాఖకు అమాత్యుడు.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు బాగా సన్నిహితుడని పేరుగాంచినవాడు. ఇంకేం, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు... ముంబయికి 300 కిలోమీటర్ల దూరంలోని చిప్లున్ లో ఐదు లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో భారీ వివాహ వేదికను ఏర్పాటు చేయించి, ఓ లక్ష మందిని ఆహ్వానించాడు.
అంతేనా... ప్రముఖులు వచ్చేందుకు 22 హెలిపాడ్లు... తినేందుకు 66 రకాల వంటకాలతో బఫే.. అంటూ చాలా ఖరీదైన వ్యవహారాన్నే తలకెత్తుకున్నాడు. కానీ, వేడుక పూర్తయిన పిమ్మట ఐటీ అధికారులు పిలవని పేరంటాళ్లా వచ్చి అమాత్యులవారి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారట. మిగతా వివరాలు వెల్లడి కాలేదు కానీ, ఇలాంటి భారీ వివాహాలు తనకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయని జాదవ్ గురువు శరద్ పవార్ వాపోయారు.