సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ కి శత్రువుల నుంచి ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ శత్రువుల కారణంగా వాళ్లు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోతుంటారు. ప్రేమించిన వాళ్లకి దూరమవుతుంటారు. ఈ తరహా కథలు తెలుగు తెరపైకి గతంలో చాలానే వచ్చాయి. అలాంటి కథనే ముంబై మాఫియా నేపథ్యంలో చెప్పడానికి తనదైన స్టైల్లో మురుగదాస్ చేసిన ప్రయత్నంగా 'దర్బార్' కనిపిస్తుంది. సమాజానికి పట్టిన చెద పురుగులను ఏరివేయడం కోసం, కమిషనర్ ఆదిత్య అరుణాచలం తన 'దర్బార్' నుంచి ముంబై పోలీస్ వ్యవస్థను ఎలా నడిపించాడనేది ఇప్పుడు చూద్దాం.
ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) పోలీస్ కమిషనర్ గా ఢిల్లీ నుంచి ముంబైకి బదిలీ అవుతాడు. భార్యను కోల్పోయిన ఆయన, తన కూతురు వల్లీకి (నివేద థామస్)కి తల్లిలేని లోటు తెలియకుండా పెంచుతూ వస్తాడు. ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తండ్రి ఒంటరివాడవుతాడని భావించిన వల్లీ, లిల్లీ (నయనతార) మనసును గెలుచుకోమని తండ్రిని ప్రోత్సహిస్తుంది. ఒక వైపున కూతురు ముచ్చటను తీర్చడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున డ్రగ్స్ మాఫియాపై ఆదిత్య అరుణాచలం విరుచుకుపడతాడు. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆదిత్య అరుణాచలం కూలదోస్తున్నాడనే ప్రతీకారంతో శత్రువులు పన్నిన వ్యూహానికి వల్లీ బలి అవుతుంది. అప్పుడు ఆదిత్య అరుణాచలం ఏం చేస్తాడు? అసలు శత్రువును ఎలా అంతం చేస్తాడు? అనేది మిగతా కథ.
యాక్షన్ .. ఎమోషన్ ప్రధాన అంశాలుగా చేసుకుని కథలను అల్లుకోవడం, ఆ కథలను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం మురుగదాస్ ప్రత్యేకత. అలాంటి మురుగదాస్ తన మార్కుకి రజనీ స్టైల్ ను జోడిస్తూ ఈ 'దర్బార్'ను నడిపించాడు. రజనీ నుంచి అభిమానులు ఆశించే అంశాలతో మురుగదాస్ ఈ కథను తీర్చిదిద్దాడు. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, బోర్ కొట్టకుండా సన్నివేశాలను పరుగులు తీయించాడు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వాటిని ప్రేక్షకుల హృదయాలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఒక వైపున డ్రగ్స్ మాఫియా ఆగడాలు .. మరో వైపున తండ్రీకూతుళ్ల అనుబంధం .. ఇంకో వైపున సున్నితమైన టీజింగ్ తో ఆయన ఈ కథను నడిపించిన తీరు బాగుంది. యోగిబాబు పాత్రతో కామెడీ టచ్ కూడా ఇచ్చాడు. ముఖ్యంగా రజనీ కాస్ట్యూమ్స్ .. ఆయన లుక్ విషయంలో మురుగదాస్ తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయమనే చెప్పాలి. లుక్ పరంగా ఆయన కొత్త రజనీకాంత్ ను చూపించాడు. ఆకర్షణీయమైన హెయిర్ స్టైల్ .. గెడ్డంతో రజనీకాంత్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఈ సినిమాలో నయనతార ఉందన్న మాటేగానీ, ఆమె హీరోయిన్ స్థానంలో కనిపించకపోవడమే సగటు ప్రేక్షకుడికి కాస్తంత అసంతృప్తిని కలిగిస్తుంది.
రజనీకాంత్ విశ్వరూప విన్యాసమే 'దర్బార్'. ఆయన లుక్ .. స్టైల్ ..కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా .. తనకి న్యాయమనిపించిన దానిని చేయడానికి పై అధికారులను సైతం లెక్కచేయని వ్యక్తిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడు. కూతురు పట్ల అమితమైన ప్రేమకలిగిన తండ్రిగా ఆయన పలికించిన హావభావాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. రజనీ కూతురిగా నివేదా థామస్ చాలా బాగా నటించింది. తండ్రి ఆనందాన్ని కోరుకునే కూతురిగా .. తన ప్రాణాలు పోయేలోగా తండ్రికి సమాచారాన్ని అందజేసే కూతురిగా ఆమె నటన మెప్పిస్తుంది. ఇక ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. హరి చోప్రాగా ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. మిగతా వాళ్లంతా పాత్ర పరిధిలో నటించారు.
సంగీతం ఫరవాలేదు .. సందర్భానికి తగినట్టుగా వచ్చి వెళుతుంటాయేగానీ గుర్తుపెట్టుకోదగిన పాటలేం లేవు. సాహిత్యం పరంగా చూసుకుంటే, డబ్బింగ్ సినిమా పాటలు ఎలా వుంటాయో అలాగే వున్నాయి. కాకపోతే తెరపై రజనీ చేసే సందడి ముందు ఇవన్నీ కొట్టుకుపోతాయి. రీ రికార్డింగ్ బాగుంది .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో ప్రేక్షకులను మూడ్ లోకి తీసుకెళ్లింది. సంతోష్ శివన్ కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్. రజనీ కాంత్ ను.. నయనతారను .. నివేద థామస్ ను చాలా అందంగా చూపించాడు.
ఇక యాక్షన్ సీన్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగానే వుంది. రామ్ -లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. కొరియోగ్రఫీ ఫరవాలేదు. 'సర్ వాళ్లకి చెప్పండి పోలీసుల జోలికి లెఫ్ట్ లో రావొచ్చు .. రైట్ లో రావొచ్చు .. స్ట్రైట్ గా రావొద్దని' .. 'ఆ చూపేంటి ఒరిజినల్ గానే విలనమ్మా' .. 'ఐయామ్ ఏ బ్యాడ్ కాప్' అంటూ రజనీ చెప్పిన డైలాగ్స్ సందర్భానికి తగినట్టుగా పేలుతూ విజిల్స్ వేయించాయి. 'ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్' అంటూ ఇంటర్వెల్ కి ముందు ఆయన స్టైల్ గా నడిచిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతారు.
మురుగదాస్ తయారు చేసుకున్న కథ సాధారణమైనదే .. కథ మొత్తంలో ఒకటే ట్విస్ట్ ఉంటుంది. అక్కడి నుంచే అసలు కథ నడుస్తుంది. కథనం గొప్పగా లేకపోయినా, రజనీతో మురుగదాస్ చేయించిన మ్యాజిక్ తో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. లవ్ .. రొమాన్స్ లేకపోవడం .. కామెడీ పాళ్లు మరీ తక్కువగా ఉండటం ఒక వెలితిగానే అనిపిస్తుంది. తెరపై నయనతార తక్కువగా కనిపించడం, రజనీతో ఆమె డ్యూయెట్లు లేకపోవడం ఒక వర్గం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది. మురుగదాస్ - రజనీ కాంబినేషన్ కి తగిన కథ కాదుగానీ, రజనీ అభిమానులను మెప్పించేలా దానిని తెరపై ఆవిష్కరించడంలో మురుగదాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
'దర్బార్' మూవీ రివ్యూ
| Reviews
Darbar Review
డ్రగ్స్ మాఫియా గుప్పెట్లో వున్న యువతను కాపాడటమే ధ్యేయంగా ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో తన ఒక్కగానొక్క కూతురును కోల్పోతాడు. అందుకు కారణమైన మాఫియా లీడర్ ను ఆదిత్య అరుణాచలం ఎలా అంతం చేశాడు? అందుకోసం ఎలాంటి వ్యూహాలను ఛేదించాడు? అనేదే కథ. సాధారణమైన కథే అయినా మురుగదాస్ తనదైన స్టైల్లో చెప్పిన తీరు వలన, రజనీ లుక్ .. స్టైల్ కారణంగా ఈ సినిమా ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంది.
Movie Name: Darbar
Release Date: 2020-01-09
Cast: Rajani Kanth, Nayanatara, Suniel Shetty, Niveda Thomas, Prateik Babbar, Yogi Babu
Director: Murugadoss
Music: Anirudh Ravichandran
Banner: Lyca Productions
Review By: Peddinti