'ప్రతిరోజూ పండగే' మూవీ రివ్యూ

Prathiroju Pandage

Prathiroju Pandage Review

కన్నతండ్రి ప్రాణాలకంటే ఉద్యోగాలే ఎక్కువనుకునే కొడుకులు ఒక వైపు .. చివరి క్షణాల్లో కొడుకులతో కలిసి ఉండటమే పండగ అనుకునే తండ్రి ఒక వైపు. ఆ కొడుకుల ఆలోచనా విధానాన్ని మార్చి .. ఆ తండ్రి ముచ్చట తీర్చే ఒక మనవడి కథే ఇది. బలమైన ఎమోషన్స్ తో తాతా మనవళ్ల చుట్టూ తిరుగుతూ, అందమైన ప్రేమను .. ఆహ్లాదకరమైన కామెడీని టచ్ చేస్తూ సాగే ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

రోజులు మారుతున్నాయి .. ఉమ్మడి కుటుంబాలు మాయమవుతున్నాయి. పట్టణాల్లో .. విదేశాల్లో ఉద్యోగాలు చేసే పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం సమయాన్ని కేటాయించలేని పరిస్థితి. వాళ్లు అనారోగ్యం పాలైనా పట్టించుకోని స్థితి. పిల్లల ఎదుగుదలకి అడ్డుపడటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో  ఒంటరితనాన్ని భరించే స్థితిలో తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అదే కథను తనదైన శైలిలో చెప్పడానికి మారుతి చేసిన ప్రయత్నంగా 'ప్రతిరోజూ పండగే' కనిపిస్తుంది. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో వాళ్లను మెప్పించిందన్నది చూద్దాం.

రఘురామయ్య (సత్యరాజ్)కి ముగ్గురు మగ పిల్లలు .. ఒక ఆడపిల్ల. పెద్ద కొడుకైన రమేశ్ (రావు రమేశ్) అమెరికాలో స్థిరపడతాడు. రెండవ కొడుకు ఆస్ట్రేలియాలో స్థిరపడగా .. మూడవ కొడుకు వేరే ఊళ్లో కేటరింగ్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. భార్యను కోల్పోయి ఒంటరివాడిగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆయన, కేన్సర్ బారిన పడతాడు. ఆయన బ్రతికేది కొన్ని రోజులు మాత్రమే అని డాక్టర్లు చెబుతారు. విషయం తెలుసుకున్న కొడుకులు .. కూతురు తమ పనులు మానుకుని ఆ పల్లెటూరు రావడానికి అంతగా ఆసక్తిని చూపించరు. డబ్బుకి .. ఉద్యోగాలకి మాత్రమే వాళ్లు విలువనిస్తారు. అయితే రమేశ్ కొడుకైన సాయి (సాయితేజ్) మాత్రం వెంటనే బయల్దేరి తాతయ్య ఊరికి చేరుకుంటాడు. తన తాతయ్య చనిపోయేలోగా ఆయనకి ప్రతిరోజు ఒక పండుగ అనిపించేలా చేయాలనుకుంటాడు. తాత కోరిక మేరకు ఆయనకి స్నేహితుడి కూతురైన 'ఆర్ణ'ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఫలితంగా చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి? అనేది మిగతా కథ.

దర్శకుడు మారుతి కొంతకాలంగా యూత్ కి .. మాస్ కి నచ్చే అంశాలను మేళవిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అదే పద్ధతిని కొనసాగిస్తూ ఆయన ఈ కథను తెరపై ఆవిష్కరించాడు. ఎమోషన్ కి పెద్దపీట వేస్తూ .. కథలో భాగంగానే కామెడీని నడిపిస్తూ .. లవ్ కోటింగ్ ఇస్తూ ఆయన ఈ కథను చెప్పిన తీరు బాగుంది. వినోదంతో కూడిన కథ, విదేశాల నుంచి మారుమూల గ్రామానికి కథను పరుగులు తీయించే పట్టు సడలని కథనం .. ప్రధానమైన పాత్రలను మలిచిన విధానం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తాయి.

పుట్టిపెరిగిన గ్రామాలను .. కనిపెంచిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని చెప్పే సందేశంతో కూడిన ఈ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు మారుతి సక్సెస్ అయ్యాడు. జీవితంలో ఎదగాలి గానీ అది తల్లిదండ్రులను మరిచిపోయేంతలా కాదు అనే సందేశానిస్తూ, కన్నవాళ్ల చివరిదశలో ఆసరాగా నిలిస్తే అది వాళ్లకి 'ప్రతిరోజూ పండగే' అవుతుందనే విషయాన్ని వినోదాన్ని జోడిస్తూ మారుతి చెప్పిన తీరు ప్రేక్షకులను కూర్చోబెట్టేస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తాత మనవుల కథ. మరణానికి చేరువలో వున్న తాతను చివరిక్షణం వరకూ సంతోషంగా ఉంచాలని తాపత్రయపడే మనవడి కథ. ఈ కథలో తండ్రిగా .. తాతగా సత్యరాజ్ తన పాత్రలో జీవించాడు. కొడుకులు .. కోడళ్ల నిజస్వరూపాలను తెలుసుకుని మౌనంగా రోదించేవాడిగా, మనవడు ఇచ్చిన ఉత్సాహంతో పరుగులుతీసే వాడిగా ఆయన నటన హైలైట్ గా నిలిచింది.

ఇక తేజు కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. తాత కోసం కుటుంబ సభ్యులందరి మనసులు మార్చే మనవడి పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఇక 'టిక్ టాక్' వీడియోలు చేసే పిచ్చి వున్న 'ఆర్ణ' పాత్రలో రాశి ఖన్నా నటన ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పాత్రలో రావు రమేశ్ మెప్పించాడు. ఎప్పటిలాగే తనదైన డైలాగ్ డెలివరీతో సన్నివేశాలను పండించాడు. మురళీ శర్మ కూడా నటనలో తనదైన మార్క్ చూపించాడు. ఇక అజయ్ .. సత్యం రాజేశ్ .. 'జబర్దస్త్' మహేశ్ .. సుహాస్ ఓకే అనిపించారు. విజయ్ కుమార్ .. ప్రభ .. నరేశ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు.  

తమన్ సంగీతం ఫరవాలేదనిపించేలా వుంది. బాణీలు పెద్ద గొప్పగా లేకపోయినా, సందర్భానికి తగినట్టుగా ఓకే అనిపిస్తాయి. రీ రికార్డింగ్ బాగుంది .. సీన్ లో నుంచి ప్రేక్షకులు జారిపోకుండా చేయగలిగింది. జయకుమార్ కెమెరా పనితనం బాగుంది. ప్రతి సన్నివేశాన్ని అందంగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా పల్లె అందాలను .. పాటలను హృద్యంగా ఆవిష్కరించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కాకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర రావు రమేశ్ అండ్ కో సీన్ ను ట్రిమ్ చేయాల్సింది. ఇక 'మృత్యుంజయ హోమం' దగ్గర జరిగిన ఫైట్ సీన్ అనవసరమనిపిస్తుంది.' ఒకటి రెండు పాటలకి కొరియోగ్రఫీ బాగుంది. 'మట్టి వాసనల మధ్య బతికిన వాడిని .. మందుల వాసనల మధ్య బతకలేనురా'.. 'లాస్ట్ స్టేజ్ లోను లాజిక్కులకేం తక్కువ లేదు' .. 'ఇది ఫైనల్ స్టేజ్ కాదు .. సెమీ ఫైనల్ స్టేజ్' .. 'ఒకడు సమాధికి శాంపిల్స్ చూపిస్తే .. ఇంకొకడు దినానికి మెనూ చూపిస్తాడు' .. 'యుద్ధం కూడా సాయంత్రం 6 తరువాత ఆపేస్తార్రా' అనే డైలాగులు గుర్తుంచుకోదగినవిగా అనిపిస్తాయి.

ఇది కొత్త కథ కాకపోయినా కొత్తగా చెప్పడానికి మారుతి ప్రయత్నించాడు. బలమైన ఎమోషన్స్ ను మాత్రమే రుద్దకుండా కామెడీని కలిపి అందిస్తూ ఎంటర్టైన్ చేశాడు. ఎంతసేపు డబ్బు .. హోదా గురించి కాకుండా తల్లిదండ్రులను గురించిన ఆలోచన చేయమని పిల్లలకు చెప్పడంలోనూ, పిల్లలతో గడిపే ప్రతిరోజూ పెద్దవాళ్లకి పండుగరోజే అని విషయాన్ని స్పష్టం చేయడంలోను దర్శకుడు మారుతి సక్సెస్ అయ్యాడు. ఈ కంటెంట్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సఫలీకృతుడయ్యాడు.  

Movie Name: Prathiroju Pandage

Release Date: 2019-12-20
Cast: Sai Dharam Tej, Rasi Khanna, Sathya Raj, Rao Ramesh, Vijay Kumar, Naresh, Prabha, Murali Sharma, Ajay  
Director: Maruthi 
Music: Thaman 
Banner: U.V. Creations, GA2 Pictures

Prathiroju Pandage Rating: 3.50 out of 5

More Reviews