మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి వెంకటేశ్ ఉత్సాహాన్ని చూపడం మొదలెట్టి చాలాకాలమే అయింది. అలా గతంలో ఆయన చేసిన 'గోపాల గోపాల' .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో మల్టీ స్టారర్ మూవీగా 'ఎఫ్ 2'తో హిట్ కొట్టేసిన వెంకటేశ్, ఏడాది చివరిలో 'వెంకీమామ'తో పలకరించాడు. ఇది ఆయన మల్టీస్టారర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. రామనారాయణ (నాజర్) ఒక గ్రామానికి చెందిన జ్యోతిష్కుడు .. ఆయన భార్య లక్ష్మి (గీత). ఈ ఇద్దరి కొడుకే వెంకటరత్నం నాయుడు (వెంకటేశ్). వెంకటరత్నం అక్క ఒక యువకుడిని ప్రేమించి ఆ విషయాన్ని తండ్రితో చెబుతుంది. ఆ పెళ్లి జరిగితే వారి మొదటి సంతానానికి ఏడాది తిరక్కముందే ఆ దంపతులు మరణిస్తారని చెప్పి రామ నారాయణ వారిస్తాడు. ఆ మాట వినకుండా వివాహం చేసుకున్న ఆయన కూతురు .. ఆమె భర్త కారు ప్రమాదంలో మరణిస్తారు.
ఇక వాళ్ల సంతానమైన కార్తీక్ ( నాగచైతన్య)ను నష్టజాతకుడని భావించిన రామనారాయణ, ఆ పిల్లాడిని పెంచుకోవడానికి నిరాకరిస్తాడు. దాంతో మేనల్లుడి బాధ్యతను వెంకటరత్నం తీసుకుని పెంచి పెద్ద చేస్తాడు. అందుకోసం ఆర్మీలో చేరాలనే ఆశయాన్ని పక్కన పెట్టేస్తాడు .. పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతాడు. అలాంటి ఈ ఇద్దరి జీవితాల్లోకి వెన్నెల (పాయల్) .. హారిక (రాశి ఖన్నా) ప్రవేశిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ మేనమామ .. మేనల్లుళ్లపై పశుపతి (రావు రమేశ్) పగబడతాడు. అందుకు కారణం ఏమిటి? పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది.
దర్శకుడు కేఎస్ రవీంద్ర ఇటు వినోదం .. అటు ఎమోషన్స్ తో కూడిన కథను ఆసక్తికరంగా తయారు చేసుకుని రంగంలోకి దిగాడు. కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా అల్లుకుని సన్నివేశాలను సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించాడు. ఆయన పాత్రలను మలిచిన తీరు .. యాక్షన్ ను .. ఎమోషన్ ను కామెడీతో కలిపి నడిపించిన విధానం ప్రేక్షకులను కూర్చోబెట్టేసింది. సాగతీత సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టనీయకుండా .. అనవసరమైన సన్నివేశాలు లేకుండా చూసుకోవడంలోను, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కు .. మాస్ ఆడియన్స్ కి అవసరమైన అంశాలను కలిపి అందించడంలోను ఆయన సక్సెస్ అయ్యాడు. మేనమామగా వెంకటేశ్ .. మేనల్లుడిగా నాగచైతన్య పాత్రలను సమతూకంగా ఆవిష్కరించడంలో సఫలీకృతుడయ్యాడు.
యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా ఏ రసమైనా వెంకటేశ్ కి కొట్టినపిండే. అందువలన ఈ సినిమాలో ఆయన పాత్రపరంగా చెలరేగిపోయాడు. మేనల్లుడిని కంటికి రెప్పలా చూసుకునే మేనమామ పాత్రలో ఆయన జీవించాడు. ముఖ్యంగా పాయల్ కి ఐలవ్ యూ చెప్పే సీన్ లోను .. పాయల్ కాల్ చేస్తే పూలు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లినప్పటి సీన్లోను ఆయన తన మార్క్ కామెడీతో నాన్ స్టాప్ గా నవ్వించాడు. ఇక వెంకటేశ్ నటనతో చైతూ నటనను పోల్చకూడదుగానీ, చాలా చోట్లా తేలిపోయాడు. పాయల్ .. రాశి ఖన్నా పాత్ర పరిథిలో నటించారు. నిజానికి ఈ ఇద్దరూ మంచి అందగత్తెలు .. కానీ ఎందుకనో వాళ్ల గ్లామర్ ను పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది. ఇక జ్యోతిష్కుడిగా నాజర్ నటన హైలైట్ గా నిలుస్తుంది. రాజకీయనాయకుడిగా తన మార్క్ డైలాగ్ డెలివరీతో రావు రమేశ్ ఆకట్టుకుంటాడు. ఆర్మీ ఆఫీసర్ గా ప్రకాశ్ రాజ్ నటనను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక గీత .. నాగినీడు పాత్రలు నామ మాత్రంగా కనిపిస్తాయి.
తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో వచ్చే 'అమ్మైనా .. నాన్నైనా నువ్వేలే వెంకీమామ' .. 'నువ్వు నేను' .. 'ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో' .. సెకండాఫ్ లో వచ్చే 'కోకాకోలా పెప్సీ' అనే సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ పరంగా ప్రేక్షకులకి కావాల్సినంత సందడి లభిస్తుందనే చెప్పాలి. ఇక రీ రికార్డింగ్ కూడా బాగా కుదిరింది. ప్రతి సన్నివేశంలోను ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తూ వెళ్లింది. ఇక ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం గొప్పగా వుంది. కశ్మీర్ లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. కలర్ ఫుల్ గా ప్లాన్ చేసిన సాంగ్స్ ను చాలా బ్యూటిఫుల్ గా తెరపై ఆవిష్కరించారు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, ప్రవీణ్ పూడి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను చాలా వేగంగా పరిగెత్తించాడు. 'కేలండర్లో డేట్ మారినంత తేలికగా నా మనసు మారదు మామా'.. 'అన్నీ నేర్పించిన మేనమామ .. తను లేకుండా బతకడమెలాగో నేర్పించలేదు' అనే డైలాగ్స్ లోతైన అర్థంతో ఎమోషనల్ గా ఆడియాన్స్ కి కనెక్ట్ అవుతాయి.
దర్శకుడు కేఎస్ రవీంద్ర ఈ సినిమాను ఆసక్తికరంగానే మలిచాడు. అయితే వెంకటేశ్ - పాయల్, చైతూ - రాశి ఖన్నా జంటల మధ్య లవ్ అండ్ రొమాన్స్ ను ఇంకా బాగా ఆవిష్కరించవచ్చు. అందుకు అవకాశం వుంది కూడా. ఆ కాంబినేషన్లోని సీన్స్ విషయంలో ఇంకాస్త దృష్టిపెడితే ఈ సినిమా ఇంకో మెట్టుపై ఉండేది. వెంకటేశ్ అభిమానులను ఎంతమాత్రం నిరాశ పరచని సినిమాగా 'వెంకీమామ'ను గురించి చెప్పుకోవచ్చు.
'వెంకీమామ' మూవీ రివ్యూ
| Reviews
Venky Mama Review
మేనల్లుడి ఆలనా పాలన చూసుకోవడం కోసం పెళ్లి చేసుకోవడం మానేసిన మేనమామ ఒక వైపు. ఆ మేనమామ కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడిన మేనల్లుడు మరో వైపు. ఈ రెండు పాత్రలు ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది.
Movie Name: Venky Mama
Release Date: 2019-12-13
Cast: Venkatesh, Payal Raj Put, Naga Chaitanya, Rasi Khanna, Prakash Raj, Nassar, Rao Ramesh, Geetha
Director: K.S. Ravindra
Music: Thaman
Banner: Suresh Productions
Review By: Peddinti