'రాగల 24 గంటల్లో' మూవీ రివ్యూ

Ragala 24 Gantallo

Ragala 24 Gantallo Review

అనాథశరణాలయంలో పెరిగిన 'విద్య'ను, శ్రీమంతుడైన రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి జరిగిన కొంతకాలానికే అతను హత్యకి గురవుతాడు. ఆ హత్యకి కారకులు ఎవరు? ఎందుకు అతణ్ణి హత్య చేయవలసి వచ్చింది? అనేదే కథ. ఆద్యంతం అనూహ్యమైన మలుపులతో సాగే ఈ కథ, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఫరవాలేదనిపిస్తుంది. 

కథ కొంతదూరం ప్రయాణం చేయగానే ఒక మర్డర్ జరగడం .. ఆ మర్డర్ పై అనేక కోణాల్లో అనుమానాలు తలెత్తేలా చేయడం.. చివరికి అసలు హంతకులను రివీల్ చేయడం తరహాలో గతంలో చాలానే కథలు వచ్చాయి. ఇలాంటి కథలు .. కథనంపై ఎక్కువగా ఆధారపడతాయి. అసలు హంతకులు ఎవరనే విషయాన్నీ చివరి వరకూ ప్రేక్షకులు అంచనా వేయలేని కథనంతో సాగే కథలే కిక్ ఇస్తుంటాయి. 'రాగల 24 గంటల్లో' చిత్రం అలాంటి కిక్ ఇచ్చిందేమో చూద్దాం.

కథలోకి వెళితే .. రాహుల్ (సత్యదేవ్) యాడ్ ఫిల్మ్ మేకర్ గా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తాడు. శ్రీమంతుడైన అతనికి అనుకోకుండా విద్య (ఈషా రెబ్బా) తారసపడుతుంది. అనాథగా పెరిగిన ఆమెను రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కోటి ఆశలతో ఆమె అతని ఇంట్లోకి అడుగుపెడుతుంది. అయితే కొంతకాలానికే రాహుల్ హత్యకి గురవుతాడు. ఆ హత్యకి కారకులు ఎవరు? ఎలాంటి పరిస్థితులు అతని హత్యకి దారితీశాయి? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ కథను ఎత్తుకున్న తీరు బాగుంది. మేఘన అనే ఒక అమ్మాయి హత్యకేసులో జైలుకెళ్లిన ఖైదీలు ఓ రాత్రివేళలో తప్పించుకుని, ఒంటరిగా వున్న కథానాయిక ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలా ఆరంభం నుంచే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతూ వెళ్లాడు. ఒక వైపున హోరున వర్షం .. మరో వైపున పారిపోయిన ఖైదీలు .. ఇంకో వైపున విద్య భర్త హత్య .. పోలీసుల వెతుకులాట. ఇలా అన్ని వైపుల నుంచి శ్రీనివాస రెడ్డి కథను అల్లుకొచ్చిన విధానం ఆకట్టుకుంటుంది.

అయితే అర్థరాత్రివేళ తన ఇంటికి వచ్చిన ఖైదీలకు విద్య కూల్ గా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం చిత్రంగా అనిపిస్తుంది. ఇక ఆ తరువాత ఈ ముగ్గురు ఖైదీలు పోలీస్ కమీషనర్ ఇంట్లో శ్రీవిద్యను కలవడం మరింత విడ్డూరం. ఒక పాత్ర చేత అతిగా యాక్షన్ చేయించి, హంతకులు ఎవరనే 'క్లూ'ను దర్శకుడు ముందుగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈషా రెబ్బా - గణేశ్ వెంకట్రామన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. గణేశ్ వెంకట్రామన్ స్నేహితుడిగా 'అదిరే అభి' పాత్ర .. ఈషా రెబ్బా పక్కింటి వ్యక్తిగా కృష్ణభగవాన్ పాత్రలు అనవసరం. కృష్ణభగవాన్ ఈ సినిమాకి మాటలు రాశాడు కనుక, ఈ పాత్రను క్రియేట్ చేసుకుని ముచ్చట తీర్చుకుని ఉంటాడు. ఇక ట్విస్టులపై ట్విస్టులు ఇస్తూ వెళ్లిన దర్శకుడు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా వాటిని రివీల్ చేస్తూ వెళ్లాడు.

ఈ సినిమాలో రాహుల్ పాత్రలో సత్యదేవ్ చాలా బాగా చేశాడు. డబ్బుకోసం .. యాడ్ ఫిల్మ్ మేకింగ్ పట్ల తనకి గల ముచ్చట తీర్చుకోవడంకోసం ఎంతకైనా తెగించే పాత్రలో మెప్పించాడు. ఆయన భార్య పాత్రలో ఈషా రెబ్బా నటన ఆకట్టుకుంటుంది. అయితే ఆమె హెయిర్ స్టైల్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉంటే ఆమె మరింత అందంగా కనిపించి ఉండేది. భర్తపట్ల ప్రేమను .. భయాన్ని ఆమె చక్కగా పలికించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీరామ్ నటన బాగుంది. ఇక గణేశ్ వెంకట్రామన్ పాత్ర పరిధిలో చేశాడు.

కథాకథనాలపరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సంగీతం .. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రఘు కుంచె సంగీతం బాగుంది. 'నీ నగుమోముకి నమోనమః' .. 'ఆకాశాన్ని కూర్చోబెడతా నీ అరచేతిలో' అనే పాటలు బాగున్నాయి. ఆయన అందించిన రీ రికార్డింగ్ ప్రేక్షకులు కథలో భాగమైపోయేలా చేసింది. ప్రతి సన్నివేశం  స్థాయిని పెంచుతూ వెళ్లింది. 'గరుడ వేగ' అంజి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. వర్షం నేపథ్యంలోని దృశ్యాలను చాలా ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ కి కూడా మంచి మార్కులే దక్కుతాయి. 'నేను ఏ విషయాన్నైనా సెన్స్ తో కాకుండా లెన్స్ తో చూస్తాను' అనే సత్యదేవ్ డైలాగ్ బాగుంది. 'నా కథను మీరు వింటున్నారని అనుకున్నానుగానీ, మీ కథలో నేను వున్నానని నాకు ఇప్పుడే తెలిసింది' అనే డైలాగ్ సందర్భానుసారంగా బాగా పేలింది.  

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉండవలసిన మలుపులు .. మెరుపులు ఈ సినిమాలో వున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ  నిర్మాణ విలువలు బాగున్నాయి. వాస్తవానికి దూరంగా అనిపించే ఒకటి రెండు సన్నివేశాల వలన, అవసరం లేకపోయినా తెరపైకి ఎంట్రీ ఇచ్చే ఒకటి రెండు పాత్రల వలన కాస్త అసహనంగా అనిపించినా, సంగీతం .. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ చేసిన సపోర్ట్ కారణంగా ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.      


Movie Name: Ragala 24 Gantallo

Release Date: 2019-11-22
Cast: Eesha Rebbah, Sathya Dev, Sri Ram, Ganesh Venkatraman 
Director: Srinivas Redde 
Music: Raghu Kunche 
Banner: Sri Navhas Creations 

Ragala 24 Gantallo Rating: 2.50 out of 5

More Reviews