సస్పెన్స్ .. హారర్ తో కూడిన చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు సిద్ధహస్తుడు. గతంలో ఆయన రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలలో చాలా వరకూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'అవును 2' తరువాత కొంత గ్యాప్ తీసుకుని, ఆత్మల నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమానే 'ఆవిరి'. తన మార్క్ కథాకథనాలతో ప్రేక్షకులను భయపెట్టడంలో రవిబాబు ఎంతవరకు సక్సెస్ అయ్యాడనేది ఇప్పుడు చూద్దాం.
రాజ్ కుమార్ (రవిబాబు) పెద్ద బిజినెస్ మేన్. ఆయన ఎప్పుడూ బిజీగా ఉండటం వలన, పిల్లలిద్దరి బాధ్యతను ఆయన భార్య లీనా (ప్రియ) చూసుకుంటూ ఉంటుంది. ఊహించని ఒక సంఘటన కారణంగా వాళ్ల పెద్ద కూతురు 'శ్రేయ' చనిపోతుంది. ఆ అమ్మాయిని మరచిపోలేక లీనా మానసికంగా కుంగిపోతుంటుంది. ఆ జ్ఞాపకాలకు దూరం కావాలనే ఉద్దేశంతో, రెండవ కూతురైన 'మున్నీ'ని తీసుకుని మరో ఇంటికి మారిపోతారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మున్నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆ దంపతులు ఆలోచన చేస్తుండగానే, ఆ అమ్మాయి అదృశ్యమవుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? మున్నీ వింతగా ప్రవర్తించడానికీ .. ఆమె అదృశ్యానికి కారకులు ఎవరు? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో మిగతా కథ ముందుకు వెళుతుంది.
ఆత్మలు వేడిని భరించలేవు .. విపరీతమైన 'ఆవిరి'ని అసలు తట్టుకోలేవు అనే అంశాన్ని కథలో భాగం చేసిన కారణంగా దర్శకుడు రవిబాబు ఈ సినిమాకి 'ఆవిరి' అనే టైటిల్ ను సెట్ చేశాడు. ఈ తరహా సినిమాను తెరకెక్కించడం రవిబాబుకి కొత్తేమీ కాదు. ఇంతకుముందు చిత్రాల కంటే మరింత బాగా ఆయన ఈ సినిమాను ఆవిష్కరించాడు. పాయింట్ చిన్నదే అయినా దానిని చెప్పిన తీరు బలంగా వుంది. తాను చెప్పదలచుకున్న కథాకథనాలను నీట్ గా .. పెర్ఫెక్ట్ గా చెప్పాడు. సస్పెన్స్ పాళ్లను పెంచుతూనే ప్రేక్షకులను నిదానంగా హారర్ వైపు తీసుకెళ్లిన తీరు బాగుంది. ఎక్కడ ఏ విషయాన్ని రివీల్ చేయాలో అక్కడ ఆ సస్పెన్స్ ను రివీల్ చేసిన విధానం బాగుంది. సత్యానంద్ స్క్రీన్ ప్లే రవిబాబుకి బాగా హెల్ప్ అయింది.
ఇక ఈ సినిమాలో రాజ్ పాత్రలో రవిబాబు చాలా బాగా చేశాడు. ఒక వైపున పెద్ద కూతురు చనిపోయిందనే బాధ .. మరో వైపున చిన్నకూతురి ధోరణిలో వచ్చిన మార్పుపట్ల ఆందోళన .. ఇంకో వైపున ఇంట్లో జరుగుతున్న చిత్రమైన సంఘటనల పట్ల అయోమయం .. ఈ హావభావాలను రవిబాబు చాలా సహజంగా పలికించాడు. ఆయన భార్య 'లీనా'గా 'ప్రియ' తన పాత్రలోని వేరియేషన్స్ ను గొప్పగా చూపించింది. కథ పతాకస్థాయికి చేరుకుంటున్న కొద్దీ ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతూ వెళ్లి, నటన పరంగా శభాష్ అనిపించుకుంది. ఆత్మలపై అధ్యయనం చేసిన శర్మ పాత్రలో భరణి శంకర్ తన పాత్రకి న్యాయం చేశాడు. కీలకమైన పాత్రలో బేబీ శ్రీముక్త నటన బాగుంది. ముక్తార్ ఖాన్ .. హిమజ తదితరులు తమ పాత్రల పరిథిలో నటించారు.
హారర్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడంలో నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ ప్రధానమైన పాత్రను వహిస్తాయి. ఈ సినిమాకి ఆ రెండూ బాగా కుదిరాయి. వైద్య అందించిన నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా ప్రేక్షకులను మూడ్ లోకి తీసుకెళ్లింది. అలాగే సుధాకర్ రెడ్డి ఫొటోగ్రఫీ కూడా మరింత బలాన్ని చేకూర్చింది. మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది .. ఎక్కడా అనవసరమైన సీన్ కనిపించదు. సంభాషణలు కూడా సందర్భానికి .. పాత్రల స్వభావానికి తగినట్టుగా వున్నాయి.
హారర్ నేపథ్యం అనగానే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆసక్తిని చూపుతారు. అలా థియేటర్ కి వచ్చిన ఆ వర్గం ప్రేక్షకులను నిరాశ పరచని సినిమాల జాబితాలో 'ఆవిరి' చేరుతుంది. ఎక్కడా ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో పెర్ఫెక్ట్ కంటెంట్ ను అందించగలనని ఈ సినిమాతో రవిబాబు మరోమారు నిరూపించుకున్నాడని చెప్పొచ్చు.
'ఆవిరి' మూవీ రివ్యూ
| Reviews
Aaviri Review
రాజ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురును పోగొట్టుకున్న ఆ దంపతులు, ఆ జ్ఞాపకాలకు దూరంగా వేరే ఇంటికి మారతారు. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి చిన్నకూతురి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఓ రాత్రివేళ హఠాత్తుగా ఆ అమ్మాయి అదృశ్యమవుతుంది. అందుకు కారకులు ఎవరు? అసలా ఇంట్లో ఏం జరుగుతోంది? అనే మలుపులతో 'ఆవిరి' సినిమా సాగుతుంది. ఆసక్తికరమైన కథనం కారణంగా ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ తరహా కథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.
Movie Name: Aaviri
Release Date: 2019-11-01
Cast: Ravi Babu, Neha Chauhan, Mukhtar Khan, Baby Sri Mukta, Himaja
Director: Ravi Babu
Music: Rajesh Vaidya
Banner: A Flying Frogs Productions
Review By: Peddinti