బుల్లితెర ప్రేక్షకులను 'బిత్తిరి సత్తి'గా నవ్వించే రవికుమార్, సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాల ద్వారా సందడి చేస్తూ వస్తున్నాడు. హీరోగానూ అవకాశం రావడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సినిమానే 'తుపాకి రాముడు'. కథాభారాన్ని మొత్తం తనపైనే వేసుకుని ఆయన చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందన్నది ఇప్పుడు చూద్దాం.
ఓ మారుమూల గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. గుడి ముందు వదిలివేయబడిన ఒక పసికందును ఒక ఒంటరి మహిళ పెంచి పెద్ద చేస్తుంది. చెక్క తుపాకి చేతబట్టి 'పిట్టలదొర' కబుర్లు చెప్పే కుటుంబానికి చెందిన ఆ మహిళ ఆ శిశువుకి 'తుపాకి రాముడు' అనే పేరు పెడుతుంది. ఊహ తెలిసేంతవరకూ అలాగే పెరిగిన రాముడు(బిత్తిరి సత్తి), ఆ తరువాత కష్టపడి పనిచేయడం మొదలుపెడతాడు. ఓ పెళ్లి చూపుల్లో జరిగిన అవమానం కారణంగా, బుక్ షాప్ ను నిర్వహించే అనిత (ప్రియ) దగ్గర అక్షరాలు నేర్చుకుంటాడు. ఆమెపై మనసు పారేసుకున్న రాముడు, తన ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటూ ఉండగా ఒక చేదు నిజం తెలుస్తుంది. అదేమిటి? అప్పుడు రాముడు ఏం చేస్తాడు? కథలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది తెరపైనే చూడాలి.
దర్శకుడు ప్రభాకర్ 'బిత్తిరి సత్తి'ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. అందువల్లనే కొంత అమాయకత్వం .. మరికాస్త మంచితనం కలిగిన స్వాతిముత్యంగా కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దాడు. చాలా వరకూ ఆ ఊళ్లో వారిలోనే కొంతమందిని కొన్నిపాత్రలకి సెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ల నుంచి మరికాస్త మంచి నటన రాబడితే బాగుండేది. కామెడీ కోసమే బిత్తిరి సత్తి సినిమాకి వస్తారు గనుక, ఆ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసింది. హాస్య సన్నివేశాలు అనుకున్నవి పెద్దగా నవ్వు తెప్పించవు.
ముఖ్యంగా హీరోయిన్ పాత్రను డిజైన్ చేసిన తీరు అసంతృప్తిని కలిగించే అవకాశమే ఎక్కువ. హీరో .. హీరోయిన్ల మధ్య 'కులం' విషయాన్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు, హీరోయిన్ పాత్రను మరోలా డిజైన్ చేయవలసింది. ఏదైతే మంచి బ్యాంగ్ అవుతుందని దర్శకుడు అనుకున్నాడో, అక్కడే ప్రేక్షకులు నిరాశకి లోనవుతారు. ఆ తరువాత హీరో హీరోయిన్లకి సంబంధించిన వాళ్ల ఊహాగానాలకి ఇక్కడే గండిపడిపోతుంది. ఇక 'గండి' అంటే గుర్తొచ్చింది .. ఈ సినిమాలో చెరువుకు 'గండి' పడుతుంది. ఆ 'గండి'ని పూడ్చే సీన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఊళ్లో జనాలంతా కలిసి ప్రవాహంలో మట్టి పోయడం నవ్వు తెప్పిస్తుంది.
ఇక 'తుపాకి రాముడి'గా బిత్తిరి సత్తి పాత్ర పరిథిలో తనదైన శైలిలో మెప్పించాడు. సందర్భాన్ని బట్టి కామెడీని .. ఎమోషన్ ను పండించాడు. అనిత పాత్రలో కథానాయిక 'ప్రియ' కూడా బాగానే చేసింది. 'రసమయి బాలకిషన్' పై ఒక పాటను చిత్రీకరించారు. కాకపోతే సందర్భం లేకుండా వచ్చే సాంగ్ అతికినట్టుగానే అనిపిస్తుంది. 'జిత్తు' పాత్రలో విలన్ గా కనిపించిన యువకుడు పల్లెటూరి విలనిజాన్ని బాగానే పండించాడు.
సంగీతం పరంగా ఈ సినిమాకి ఎక్కువ మార్కులు దక్కుతాయి. పాటలన్నీ కూడా బాగానే వున్నాయి. 'బోనాలు' .. 'బతుకమ్మ' పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 'స్వాతిముత్యమై కురిసింది ఆనందం' అనే పాట కూడా బాగానే వుంది. ఫొటోగ్రఫీ కూడా ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. పల్లె అందాలను బంధించడంలో కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే .. ఊళ్లో వాళ్ల ఫుడ్డు లాగేసుకుని రాముడు తినేయడం, వాళ్లంతా ప్లాన్ చేసి ఆయనను కొట్టడానికి ప్రయత్నించడం వంటి సీన్స్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక రీ రికార్డింగ్ ఓ మాదిరిగా వుంది.
'బిత్తిరి సత్తి'ని హీరోగా అనుకున్నప్పుడు దర్శకుడు కామెడీపైనే ఎక్కువగా దృష్టి పెట్టవలసింది. కానీ ఆయన ఎమోషన్ సైడ్ ను ఎక్కువగా టచ్ చేశాడు. దాంతో కథ ఆశించిన స్థాయిలో రక్తికట్టలేదు. చివర్లో సందేశం ఉన్నప్పటికీ, ఎలాంటి అనూహ్యమైన మలుపులు లేకుండా సాదాసీదాగా సాగిపోతూ వచ్చిన కథ అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
'తుపాకి రాముడు' మూవీ రివ్యూ
| Reviews
Thupaki Ramudu Review
పుట్టుకతోనే అనాథలా విసిరివేయబడిన రాముడు, ఆ ఊళ్లో వాళ్లంతా తమవాడు అనుకునేలా పెరుగుతాడు. పుస్తకాల షాపు నడుపుకునే అనితపై మనసు పారేసుకున్న రాముడికి ఒక చేదు నిజం తెలుస్తుంది. అదేమిటి? అప్పుడు రాముడు ఏం చేస్తాడు? అనేదే కథ. గ్రామీణ నేపథ్యంలో సాదాసీదాగా సాగిపోయే ఈ కథ, బిత్తిరి సత్తి నుంచి ఆశించే కామెడీని అందించలేకపోయింది.
Movie Name: Thupaki Ramudu
Release Date: 2019-10-25
Cast: Bithiri Sathi, Priya, Rasamayi Balakishan
Director: T. Prabhakar
Music: T. Prabhakar
Banner: Rasamayi Films
Review By: Peddinti