పుట్టిపెరిగిన ఊరుపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉంటుంది. తమ ఊరుకి మంచి చేయడం కోసం తమ జీవితాలను త్యాగం చేసినవాళ్లు ఎంతోమంది వున్నారు. ఈ తరహాలో తెరపైకి వచ్చిన కథలు ఎన్నో వున్నాయి. అదే తరహా కథకు కొంత రొమాన్స్ ను జోడించి అందించడానికి దర్శకుడు శంకర్ భాను చేసిన ప్రయత్నంగా 'ఆర్డీఎక్స్ లవ్' కనిపిస్తుంది. అందాల కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన పాయల్, తొలిసారిగా చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందన్నది ఒకసారి పరిశీలిద్దాం.
ఈ కథ 'చంద్రన్నపేట' అనే ఓ మారుమూల పల్లెటూళ్లో మొదలవుతుంది. ఆ గ్రామంతో పాటు మరో 40 గ్రామాలు 'నది'కి ఇవతల వైపున ఉంటాయి. చదువుకుగానీ .. హాస్పిటల్ కి గాని వెళ్లాలంటే 200 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేయవలసిందే. అందువల్లనే వాళ్లంతా ఆ నదిపై 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించమని ముఖ్యమంత్రి బాపినీడు(నాగినీడు) తో మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోతుంది.
ఆ సమస్యను చూస్తూనే అలివేలు (పాయల్) పెద్దదవుతుంది. ప్రభుత్వ పథకాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తూనే, తన ఊరు సమస్యను పరిష్కరించే మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అలివేలు ప్రేమలోపడిన సిద్ధూ (తేజుస్) ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. శ్రీమంతుడైన ఆయన తండ్రి గిరిప్రకాశ్ నారాయణ్ (ఆదిత్యమీనన్)కి ఇది ఎంతమాత్రం నచ్చదు. దాంతో ఆయన అలివేలును అడ్డుతప్పించాలనుకుంటాడు. అప్పటి నుంచి కథ అనేక మలుపులు తీసుకుంటుంది.
టైటిల్ ను బట్టి .. పాయల్ రాజ్ పుత్ కి గల క్రేజ్ ను బట్టి, దర్శకుడు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీనే చెబుతాడని ప్రేక్షకులు అనుకుంటారు. ఆ తరహా సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆ రొమాన్స్ వెనుక ఒక ఆదర్శవంతమైన ప్రయోజనాన్ని ఆవిష్కరించడానికి ఆయన ప్రయత్నించాడు. అయితే ఈ రెండూ పొసగని అంశాలను ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు.
సీతారాముల విగ్రహాలపై ఎమోషనల్ గా సీన్ ఓపెన్ చేసిన దర్శకుడు, ఆ వెంటనే వినకూడని మాటలను అంటూ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ రాసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక ఆదర్శవంతమైన ఆశయంతో అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి హీరోయిన్ ఎంచుకున్న మార్గం సరైనది కాదనిపిస్తుంది. యూత్ ను అలరించడం కోసమన్నట్టుగా ఆ పాత్రతో కొన్ని రకాల పనులు చేయించడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా క్లుప్తంగా చెప్పాల్సిన విషయాలను కూడా ఆయన సాగదీస్తూ సన్నివేశాలుగా రాసుకుని అసహనాన్ని కలిగించాడు.
ఇక 'ఆమని' వంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. కీలకమైన సన్నివేశంలో ఆ పాత్ర చెప్పే నాలుగు డైలాగ్స్ ను కూడా పవర్ఫుల్ గా రాసుకోలేకపోయాడు. హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచి ఆమె కూడా తిరిగేవారు ఆమె ఏజ్ గ్రూప్ వారు కాకపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది. వంతెన నిర్మాణం కోసం సీతారాముల విగ్రహాలను వేరు చేయడం ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. హాస్టల్ వార్డెన్ గా 'గే' పాత్రలో చమ్మక్ చంద్ర చేత, లేడీ కానిస్టేబుల్ గా విద్యుల్లేఖ తోను చేయించిన కామెడీ పేలలేదు. రొమాంటిక్ సీన్స్ విషయంలో .. సాంగ్స్ విషయంలో మాత్రం దర్శకుడు ఎక్కువ మార్కులనే సంపాదించుకుంటాడని చెప్పాలి.
సిద్ధూ పాత్రలో తేజుస్ ప్రేక్షకులను మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కడా కూడా హీరోగా మాత్రం అనిపించడు. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కనుక ఓకే అని సరిపెట్టుకోవాలంతే. ఇక అలివేలు పాత్రలో పాయల్ చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ లో ఆమె మరింత గ్లామరస్ గా మెరిసింది. అలివేలు పాత్రతో తలపడే ప్రతినాయక పాత్రలో ఆదిత్య మీనన్ చాలా సహజంగా నటించాడు. పాయల్ తల్లిగా తెరపై తులసి కనిపించింది కాసేపే అయినా తన మార్కును చూపించింది. రెండే సీన్లు అయినా పోలీస్ ఆఫీసర్ గా ముమైత్ ఖాన్ బాగా చేసింది. ఇక సీనియర్ నరేశ్ .. ఆమని .. నాగినీడు పాత్రలకు ఎలాంటి ప్రత్యేకతగానీ .. ప్రాధాన్యతగాని కనిపించదు.
రధన్ అందించిన బాణీల్లో 'ఒరబ్బీ కొంగేజారిందంటే' .. 'నీ నఖ శిఖలే' ఆకట్టుకునేలా వున్నాయి. రామ్ ప్రసాద్ ఫొటో గ్రఫీ బాగుంది. పాయల్ ను ఆయన ఈ సినిమాలో చాలా అందంగా చూపించాడు. ముఖ్యంగా 'నీ నఖ శిఖలే' పాటలో తెరపై నుంచి ఆయన ఎవరినీ చూపు తిప్పుకోకుండా చేశాడు. రొమాంటిక్స్ సీన్స్ తో పాటు .. రెయిన్ ఎఫెక్ట్ లోని ఎమోషనల్ సీన్ చిత్రీకరణలోను ఆయన పనితనం కనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ట్రాఫిక్ పోలీస్ సీన్ .. సిద్ధు గర్ల్ ఫ్రెండ్ డ్రామా సీన్ .. చమ్మక్ చంద్ర 'గే' సీన్ .. 'కామసూత్ర'పై పల్లె ప్రజలకి అవగాహన కల్పించే ఎపిసోడ్ .. గుట్కా మాన్పించే ఎపిసోడ్ .. రౌడీలతో అలివేలు టీమ్ ను కబడ్డీ ఆడించే సీన్లలో కొన్ని ఎత్తేసి, మరికొన్ని ట్రిమ్ చేయవచ్చు. రీ రికార్డింగ్ ఫరవాలేదు .. గణేశ్ స్వామి కొరియోగ్రఫీ బాగుంది.
రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగిస్తుంది. రొమాన్స్ వైపు నుంచి ఎమోషన్ వైపు వెళ్లడం యూత్ కి కొంత నిరాశను కలిగిస్తుంది. ఈ మధ్యలో పేలవమైన .. అనవసరమైన సన్నివేశాలు ఉండనే వున్నాయి. ఈ కారణాలుగానే, సంగీతం .. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ సపోర్ట్ చేసినా ఈ సినిమా యూత్ ను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.
'RDX Love' మూవీ రివ్యూ
| Reviews
'RDX Love' Review
ఊరు కోసం .. ఊరు జనాల బాగు కోసం తన శీలాన్ని పణంగా పెట్టిన ఓ అందమైన యువతి కథ ఇది. ఆ ఊరు సమస్యని పరిష్కరించడం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన అలివేలు కథ ఇది. రొమాంటిక్ లవ్ స్టోరీగా కనిపించే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో, శృంగారం - ఆదర్శం అనే రెండు అతకని అంశాలను కలిపి చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకు మాత్రమే ఫలించిందని చెప్పాలి.
Movie Name: 'RDX Love'
Release Date: 2019-10-11
Cast: Tejus Kancherla, Payal, Naresh, Aamani, Aaditya Menon,Tulasi,Mumaith Khan
Director: Shankar Bhanu
Music: Radhan
Banner: Happy Movies
Review By: Peddinti