'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్' - (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ

  • తెలుగు వెబ్ సిరీస్ గా 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్'
  •  పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే సినిమా 
  • దాదాపు కొత్త ఆర్టిస్టులతో చేసిన ప్రయత్నం
  • కొత్తదనం లేని కథాకథనాలు 
  • రొటీన్ గా సాగే సన్నివేశాలు 

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్ పైకి మరో తెలుగు సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ పేరే 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్'. టైటిల్ వినగానే ఇది కరీంనగర్ చుట్టూ తిరిగే కథ అనీ, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిందని తెలుస్తూనే ఉంది. అయితే ఇది అక్కడి పొలిటికల్ డ్రామాను కలుపుకుని సాగుతుంది. సీజన్ 1లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఎంతవరకూ ప్రేక్షకులకు మెప్పించి ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం.

కరీంనగర్ లో గని (సాయి) టింకూ (అమన్)  బిట్టూ (అనిరుధ్) సత్తి (గోపాల్ మదన్) స్నేహితులుగా ఉంటారు. అందరివీ మధ్య తరగతి కుటుంబాలే. ఏదైనా ఉద్యోగం చూసుకోమని ఇంట్లో పేరెంట్స్ పోరుతూనే ఉంటారు. దాంతో నలుగురూ కూడా కొంత డబ్బు పోగేసుకుని ఏదైనా బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంటారు. అతికష్టం మీద కొంత డబ్బును సమకూర్చుకోగలుగుతారు. ఇక అదే ఊళ్లో రౌడీయిజం నుంచి రాజకీయాలవైపు అడుగులు వేసిన పురుషోత్తం (గోవర్ధన్) కూడా, తనదైన దారిలో ముందుకు వెళుతూ ఉంటాడు. 

పురుషోత్తానికి నేరచరిత్ర ఉంటుంది. అయినా అతను ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికిగాను రంగంలోకి దిగుతాడు. అందుకుగాను పెద్ద మొత్తంలో డబ్బును సిద్ధం చేసుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే పాత నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. దాంతో ఇటు 'గని' ఫ్రెండ్స్ .. అటు పురుషోత్తం కూడా తమ దగ్గరున్న డబ్బును ఎలా మార్చాలో తెలియక  అయోమయంలో పడిపోతారు. 

ఆ సమయంలోనే వ్యసన పరుడైన ఓ బ్యాంకు మేనేజర్ ను 'గని' ఫ్రెండ్స్ కలుసుకుంటారు. కమీషన్ తీసుకుని, పాత కరెన్సీని మార్చేసి ఇవ్వమని అడుగుతారు. అయితే ఆ మేనేజర్ ఈ విషయంలో పురుషోత్తానికి సాయం చేసి, 5 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక స్కామ్ లో ఈ నలుగురినీ ఇరికిస్తాడు. దాంతో వాళ్లు జైలుపాలవుతారు. అక్కడ వాళ్లకి 'గట్టు శీను' (మహేశ్ రావుల్) తారసపడతాడు. అక్కడ అతని ఆధిపత్యమే నడుస్తూ ఉంటుంది.

'గని' ఫ్రెండ్స్ నిజంగానే 5 కోట్లు కొల్లగొట్టారని భావించిన గట్టు శీను, ఆ డబ్బు ఎక్కడ పెట్టింది చెప్పమని వాళ్లను వేధిస్తూ ఉంటాడు. గట్టుశీను ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న అతని  మనుషులు, 'గని' మిత్రబృందం ఇళ్లలో సోదాలు చేస్తూ వాళ్ల పేరెంట్స్ ను భయపెడుతూ ఉంటారు. ఈ విషయం గని ఫ్రెండ్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. తమని మరింతగా రెచ్చగొడుతున్న గట్టు శీనుని వాళ్ల నలుగురూ కలిసి చంపేస్తారు. 

కొంత కాలం శిక్షను అనుభవించిన తరువాత ఆ నలుగురూ జైలు నుంచి విడుదలవుతారు. అప్పటికీ లోకల్ గా కొంతమంది అవినీతి పోలీస్ అధికారుల అండదండలతో  'బాచన్న' రౌడీయిజం .. పురుషోత్తం రాజకీయం .. నడుస్తూ ఉంటాయి. బాచన్న ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టేసి .. పురుషోత్తంతో చేతులు కలిపిన గని, గ్యాంగ్ గా లీడర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలో ఆ ఫ్రెండ్స్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే కథ.

కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను రమేశ్ ఎలిగేటి సమకూర్చగా, బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించాడు. కరీంనగర్ కి చెందిన నలుగురు కుర్రాళ్ల జీవితాలు ఎలా నేరచరిత్ర వైపు లాగబడ్డాయి. జైలు నుంచి విడుదలైన తరువాత లోకల్ గా వాళ్లు నేర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు? అక్రమ వ్యాపారాల్లో తమకి అడ్డొచ్చిన రాజకీయనాయకులను ఎలా ఎదుర్కొన్నారు? అనేది దర్శకుడు ఆవిష్కరించాడు. 

కథ చాలా సాదా సీదాగానే మొదలవుతుంది. ఆరంభంలో కొత్త ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ రాబట్టలేదని కూడా అనిపిస్తుంది. ఆ తరువాత కొత్త ఆర్టిస్టులు తమ పాత్రల్లో కుదురుకున్నారు. స్క్రీన్ ప్లే పరంగా కూడా దర్శకుడు మేజిక్ లు ఏమీ చేయలేదు. కథ మొత్తంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ ఖైదీలుగా .. జైల్లో ఇతర ఖైదీలతో గొడవపడే సీన్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే పురుషోత్తం కొడుకు 'నందా' వైపు నుంచి నడిచే కొన్ని సీన్స్ కూడా ఫరవాలేదు.

లోకల్ గా జరిగే గ్యాంగ్ వార్ లాంటి కథ గనుక, తక్కువ బడ్జెట్ లోనే ఈ సిరీస్ ను నిర్మించారు. కొత్త కుర్రాళ్లు ప్రధానమైన పాత్రలను పోషించారు. అందువలన పాత్రలకి తగిన పవర్ ను, బాడీ లాంగ్వేజ్ పరంగా .. ఎక్స్ ప్రెషన్స్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా దర్శకుడు సరైన అవుట్ పుట్ తీసుకోలేదు. ఇక ఈ కుర్రాళ్ల ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఎమోషన్స్ ను కనెక్ట్ చేయలేకపోయారు. ఫొటోగ్రఫీ ఫరవాలేదు .. అనంత్ శ్రీకర్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు బూస్ట్ ఇవ్వలేకపోయింది. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ ఓకే. 

కొంతమంది స్నేహితులు పరిస్థితుల కారణంగా జైలుకు వెళ్లడం .. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మరింత రాటుదేలడం .. బయటికి వచ్చాక స్వార్థ రాజకీయాలను తట్టుకుంటూ నేరస్థులుగానే ఎదగడం అనే కథలు గతంలో చాలానే వచ్చాయి. కథలో కొత్త కోణాలుగానీ ... కొత్త అంశాలుగాని కనిపించవు. దాదాపు కొత్త ఆర్టిస్టులతో చేయడం ... సిరీస్ మొత్తాన్ని కరీంనగర్ లోనే చిత్రీకరించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Movie Details

Movie Name: Karimnagar's Most Wanted

Release Date: 2023-12-22

Cast: Sai Surepally, Aman, Anirudh, Gopal Madan, Mahesh Ravul, Teja Kodati

Director: Balaji Bhuvanagiri

Producer: Streat Beatz Cinemas

Music: Ananth Srikar

Banner: Streat Beatz Cinemas

Review By: Peddinti

Karimnagar's Most Wanted Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews