తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో హరీశ్ శంకర్ కనిపిస్తాడు. రీమేక్ లను సమర్థవంతంగా తెరకెక్కించడంలో హరీశ్ శంకర్ కి మంచి అనుభవం వుంది. అలా ఆయన 2014లో తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' సినిమాను తెలుగులో 'గద్దలకొండ గణేశ్' గా తెరకెక్కించాడు. తమిళంలో హిట్ కొట్టిన ఆ కథతో తెలుగు ప్రేక్షకులను ఆయన ఎంతవరకూ మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. అభి (అధర్వ మురళి) దర్శకుడిగా ఎదగాలనే పట్టుదలతో ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు. ఒకానొక సందర్భంలో ఆ దర్శకుడు 'అభి'ని అందరిముందు అవమాన పరుస్తాడు. దాంతో తనే దర్శకుడిగా మారి ఒక సినిమాను రూపొందించాలని అభి నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆయన గద్దలకొండ గణేశ్ (వరుణ్ తేజ్) అనే గ్యాంగ్ స్టర్ పేరు వింటాడు. గద్దలకొండ గణేశ్ ను సీక్రెట్ గా అనుసరిస్తూ ఆయన గురించి తెలుసుకుని, ఆ విశేషాలను కథగా తయారు చేసుకుని సినిమా తీయాలనుకుంటాడు.
అందుకోసం 'గద్దలకొండ' ఊరుకి చేరుకుంటాడు. అక్కడ తన బాల్య మిత్రుడైన కొండా మల్లికార్జున్ (సత్య) ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఒక వైపున తాను వచ్చిన పనులను చక్కబెడుతూనే మరో వైపున బుజ్జమ్మ(మృణాళిని రవి) ప్రేమలో పడతాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వలన, తన కదలికలపై అభి కన్నేశాడని తెలుసుకున్న గణేశ్, అతణ్ణి చంపడానికి బయల్దేరతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? పర్యవసానాలు ఎలాంటివి? అనేది తెరపైనే చూడాలి.
దర్శకుడు హరీశ్ శంకర్ తెలుగు నేటివిటీకి తగినట్టుగా 'జిగర్తాండ' కథలో కొన్ని మార్పులు చేసి, ఈ సినిమాను తెరకెక్కించాడు. తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర విలన్ పాత్ర వంటిదే. అదే పాత్రను హీరో కోణంలో చూపించడానికి హరీశ్ శంకర్ చేసిన ప్రయత్నంగా 'గద్దలకొండ గణేశ్' సినిమా కనిపిస్తుంది. 'వేటపాలెం' వీర్రాజును లేపేసే గద్దలకొండ గణేశ్ ఇంట్రడక్షన్ సీన్ తోనే హరీశ్ శంకర్ అభిమానులతో క్లాప్స్ కొట్టించాడు. 'గద్దలకొండ' ఎమ్మెల్యే అభ్యర్థిని వ్యతిరేకించే శత్రువులపై గణేశ్ విరుకుపడే సీన్ తో ఆయన పాత్రను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఈ తరహా యాక్షన్ సీన్లకు కామెడీని జోడిస్తూ ఆయన ఫస్టాఫ్ ను ఆసక్తికరంగా నడిపించాడు. ఇక గణేశ్ ఫ్లాష్ బ్యాక్ .. పూజా హెగ్డేతో కలిసి ఆయన పండించిన సన్నివేశాలతో సెకండాఫ్ నడుస్తుంది. సెకండాఫ్ లోని ట్విస్టులు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్స్ కి కూడా చోటిచ్చి హరీశ్ శంకర్ ఈ కథకు న్యాయం చేశాడు.
'గద్దలకొండ గణేశ్' పాత్రలో వరుణ్ తేజ్ చెలరేగిపోయాడనే చెప్పాలి. పాత్రలో ఆయన పూర్తి ఇన్వాల్వ్ అయిన విషయం ప్రతి సీన్ లోను స్పష్టంగా తెలుస్తుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని పండించడంలో ఆయన గతంలో కంటే మంచి పరిణతిని కనబరిచాడు. శ్రీదేవి తారసపడినప్పుడు .. తను హీరో కావాలనుకున్నప్పుడు .. తనలో మంచి మార్పు మొదలైనప్పుడు .. తల్లి దగ్గర కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాల్లో హావభావాలను గొప్పగా ఆవిష్కరించాడు. లుక్ పరంగాను .. తెలంగాణ యాస పరంగాను ఆయన మంచి మార్కులు కొట్టేశాడు.
ఇక తమిళంలో హీరోగా మంచి పేరున్న అధర్వ .. 'అభి' పాత్రను సమర్థవంతంగా పోషించాడు. పాత్రకి తగినట్టుగా చాలా నీట్ గా చేశాడు. వరుణ్ తేజ్ జోడీగా శ్రీదేవి పాత్రలో పూజా హెగ్డే చాలా బాగా చేసింది. 1990ల నాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆమె ఎంట్రీ ఇస్తుంది. లంగా ఓణీతో రెండుజెళ్ల సీతలా ఆమె కొత్తగా కనిపించింది. లవ్ ను .. ఎమోషన్ ను చక్కగా ఆవిష్కరించింది. ఈ సినిమాలో ఆమె మరింత అందంగా కనిపించింది. 'దేవత' సినిమాలోని పాటలో డాన్స్ బాగా చేసింది. కాకపోతే లాంగ్ షాట్స్ లో మాత్రం వరుణ్ తేజ్ ముందు ఆమె చాలా పీలగా అనిపించింది. అధర్వ జోడీగా ఈ సినిమా ద్వారానే మృణాళిని రవి పరిచయమైంది. పాత్ర పరిథిలో ఫరవాలేదు అనిపించింది. ఇక అన్నపూర్ణ .. తనికెళ్ల భరణి .. బ్రహ్మాజీ .. సత్య .. ప్రభాస్ శ్రీను .. రచ్చరవి .. సుబ్బరాజు ఓకే అనిపించారు.
సంగీతం పరంగా చూసుకుంటే మిక్కీ.జె మేయర్ స్వరపరిచిన బాణీలు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఆయన అందించిన రీ రికారింగ్ సన్నివేశాలకి మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. 'అయనాంకా బోస్' ఫొటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను .. పాటలను తెరపై ఆయన ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మా' పాటను చాలా కలర్ ఫుల్ గా .. బ్యూటిఫుల్ గా చిత్రీకరించాడు.
ఎడిటింగ్ పరంగా కూడా మంచి మార్కులే పడతాయి. వరుణ్ తేజ్ అండ్ టీమ్ కి నటనలో బ్రహ్మాజీ శిక్షణ ఇచ్చే ఎపిసోడ్ ను కొంత ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ కూడా బాగుంది. హరీశ్ శంకర్ అందించిన సంభాషణల్లో కొన్ని బాగా పేలాయి. 'వాడు ఊపిరి తీస్తే గాలికి గత్తర బుట్టి గమనం మార్చుకుంటుంది' .. 'నాపై పందాలు వేస్తే గెలుస్తరు .. నాతోటి పందాలు కాస్తే సస్తరు' .. 'కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు .. నాకు మాత్రం కళ్యాణం అంటేనే కక్కొచ్చేలా చేశారు' .. 'నమ్మకమనేది ప్రాణం లెక్కరా .. ఒక్కసారి పోతే మళ్లీ రాదు' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి.
రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు .. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ కంటెంట్ ను కనెక్ట్ చేయడంలో హరీశ్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. వరుణ్ తేజ్ లుక్ విషయంలోను .. ఆయన డైలాగ్ డెలివరీ విషయంలోను హరీశ్ శంకర్ తీసుకున్న శ్రద్ధకు .. వరుణ్ తేజ్ ను కొత్తగా చూపించిన తీరుకు ఎక్కువ మార్కులు పడిపోతాయి. నాయకా నాయికల మధ్య లవ్ ట్రాక్ ను 1990 కాలంలో ఆయన నడిపించిన తీరు బాగుంది. ఇక 'దేవత' సినిమాలోని పాటను ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలపడానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా ఫలించింది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లతో ఈ సినిమాను పూర్తి వినోదభరితంగా ఆవిష్కరిస్తూ, మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో హరీశ్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
'గద్దలకొండ గణేశ్' మూవీ రివ్యూ
| Reviews
Gaddalakonda Ganesh Review
అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్న 'అభి'కి ఒక దర్శకుడి కారణంగా అవమానం ఎదురవుతుంది. దాంతో మంచి కథ తయారు చేసుకుని ఏడాదిలోగా దర్శకుడిగా మారాలనుకుంటాడు. 'గద్దలకొండ గణేశ్' అనే ఒక గ్యాంగ్ స్టర్ ను సీక్రెట్ గా ఫాలో అవుతూ ఆయన కథను తెరకెక్కించాలనుకుంటాడు. ఆ క్రమంలో ఆ యువకుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకోవచ్చు.
Movie Name: Gaddalakonda Ganesh
Release Date: 2019-09-20
Cast: Varun Tej, Pooja Hegde, Atharvaa, Mrinalini Ravi, Sathya, Bharani, Brahmaji, Dimple Hayathi
Director: Harish Shankar
Music: Mickey J Meyer
Banner: 14 Reels Plus
Review By: Peddinti