'ఓటర్' మూవీ రివ్యూ

Voter

Voter Review

స్వార్థ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన మరో సినిమా ఇది. ఓటు విలువ తెలియజేస్తూ యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట వేసినా, కథాకథనాలు బలంగా లేకపోవడం వలన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ మధ్య కాలంలో రాజకీయాల నేపథ్యంలోని కథలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. ఓటుకు వున్న విలువ ఎలాంటిదో ఓటర్లకు చెప్పి చైతన్యవంతులను చేయడానికి కథానాయకుడు రంగంలోకి దిగడం .. స్వార్థరాజకీయ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం వంటి ప్రధాన లక్ష్యంతో ఆ కథలు కంచికి వెళ్లాయి. అదే తరహా కథ అయినప్పటికీ దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాలో కొత్తగా ఒక పాయింట్ ను 'టచ్' చేశాడు. ఆ పాయింట్ ఏమిటో .. దానిని తెరపై ఆవిష్కరించడంలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడో చూద్దాం.

గౌతమ్ (మంచు విష్ణు) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. హైదరాబాదులో వున్న గౌతమ్ తల్లిదండ్రులు (నాజర్ - ప్రగతి) ఆయనకి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓటు వేయడానికి అమెరికా నుంచి హైదరాబాదు వచ్చిన గౌతమ్, ట్రాఫిక్ లో భావన (సురభి)ని చూసి మనసు పారేసుకుంటాడు.

తర్వాత తనకి తెలియకుండానే భావన ఇంటికి పెళ్లిచూపులకి వెళతాడు. భావన నచ్చేసిందని చెప్పేస్తాడు. తాను ఓకే అనాలంటే ఎదుటివారికి టాస్కులిచ్చే అలవాటున్న భావన, రాజకీయనాయకుడైన గొట్టం గోవిందం (పోసాని) చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చేలా చేయగలిగితే గౌతమ్ ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దాంతో ఆ టాస్కును  పూర్తిచేయడం కోసం గౌతమ్ తనదైన స్టైల్లో గొట్టం గోవిందం వెంటపడుతుంటాడు.

ఈ క్రమంలోనే పేదల కోసం కేటాయించబడిన వందల కోట్ల విలువ చేసే ఒక స్థలాన్ని, గొట్టం గోవిందం చేత మంత్రి భానుశంకర్ (సంపత్ రాజు) కబ్జా నుంచి బయటికి తీసుకురావడానికి గౌతమ్ ప్రయత్నిస్తాడు. ఈ కారణంగా భానుశంకర్ కి శత్రువుగా మారిన గౌతమ్ ఆయన వలన ఎదుర్కునే అనూహ్యమైన పరిస్థితులతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు జి.ఎస్. కార్తీక్ బలమైన కథాకథనాలను సిద్ధం చేసుకోకుండానే బరిలోకి దిగినట్టుగా అనిపిస్తుంది. ప్రజలకు ఉపయోగకరమైన పనులను చేయని రాజకీయనాయకులను 'రీకాల్ ఎలక్షన్' పేరుతో ఓడించి .. ఆ పదవి నుంచి దించేయాలనే ఒక మంచి పాయింటునే ఆయన ఎంచుకున్నాడు. కాకపోతే ఆ పాయింట్ చుట్టూ తిరిగిన సన్నివేశాలు .. పాత్రలు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. స్క్రీన్ ప్లే లో 'బిగి' లేకపోవడం వలన, సన్నివేశాలు అల్లినట్టుగా కాకుండా అతికించినట్టుగా అనిపించడమనేది మొదటి నుంచే మొదలైపోయింది.

కథానాయకుడికి మద్దతుగా నిలబడవలసిన సమయంలో ఓటర్లంతా విలన్ కి భయపడి ఇళ్లలో దాక్కుంటే, రిక్షావాడిగా ధైర్యంగా ఎల్బీ శ్రీరామ్ ఒక్కడే బయటికి రావడం, గతంలో వచ్చిన కొన్ని సినిమాలలోని ఆ తరహా సన్నివేశాలను గుర్తుచేస్తాయి. నాయకా నాయికల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ను గానీ, ప్రజలకు అండగా హీరో పోరాడే సమయంలో మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్ ను గాని దర్శకుడు రాసుకోలేకపోయాడు.

ఇక కామెడీకి కాస్తంత చోటుకూడా దక్కకపోవడంతో ప్రేక్షకులకు మరింత అసహనాన్ని కలిగిస్తుంది. పాటలు కూడా రెండే ఉండటం .. అందులో ఒక పాట ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుగానే ఉండటంతో సగటు ప్రేక్షకుడికి ఆ వైపు నుంచి లభించే ఆనందాన్ని కూడా ఆవిరి చేస్తుంది. ఒకటి రెండు డైలాగ్స్ తప్ప సంభాషణలు కూడా మనసుకు పట్టుకోకుండా మధ్యలోనే జారిపోయాయి.

నటీనటుల నటన విషయానికొస్తే .. మంచు విష్ణు తన పాత్రను మంచి కాన్ఫిడెన్స్ తో చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. సాధారణంగా మంచు విష్ణు తన సినిమాల్లో కామెడీ మిస్ కాకుండా చూసుకుంటాడు .. కానీ ఈసారి అది మిస్ అయింది .. అదే ఈ సినిమాకి ఒక మైనస్ గా మారింది. ఇక కథానాయికగా సురభి చాలా అందంగా కనిపించింది. అయితే, 'నేనూ వున్నాను సుమా' అన్నట్టుగా ఫ్రేమ్ లో కనిపిస్తుందిగానీ ఆమె చేయడానికేమీ లేదు. సంపత్ రాజు మంచి విషయమున్న నటుడు .. కానీ స్వార్థపరుడైన రాజకీయనాయకుడిగా ఆయన స్థాయిలో ఆ పాత్రను తీర్చిదిద్దలేకపోయారు.

హీరో తల్లితండ్రులుగా నాజర్ - ప్రగతి కనిపిస్తారుగానీ .. వాళ్ల కాంబినేషన్లో చెప్పుకోదగిన సన్నివేశాలు లేవు. ఇక సీట్లలో కూర్చున్న ప్రేక్షకుడు కాస్త నవ్వు ముఖం పెట్టింది ఎప్పుడయ్యా అంటే, తెరపై పోసాని కనిపించినప్పుడు మాత్రమే. వాగ్దానాలు చేసి .. హీరో టార్చర్ తో వాటిని నెరవేర్చలేక నానా తంటాలుపడే రాజకీయనాయకుడిగా ఆయన తన మార్కు చూపించాడు. సంగీతం పరంగా చూసుకుంటే పాటల్లో పస తక్కువ. రీ రికార్డింగ్ .. ఎడిటింగ్ పరంగా చూసుకున్నా తక్కువ మార్కులే పడతాయి. ఫొటోగ్రఫీ ఫరవాలేదనిపించుకుంది. కథలో అసలుకన్నా హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. కథా వస్తువును వినోదానికి దూరంగా తీసుకెళ్లడమే ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. ఊహకందని సన్నివేశాలుగానీ .. ఆసక్తికరమైన మలుపులుగాని లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్.
-పెద్దింటి     
               

Movie Name: Voter

Release Date: 2019-06-21
Cast: Manchu Vishnu,Surabhi
Director: G.S.Karthik Reddy
Music: Thaman
Banner: Raamaa Reels

Voter Rating: 2.50 out of 5

More Reviews