'సాహో' మూవీ రివ్యూ

Saaho

Saaho Review

కథ బలమైనదైనప్పుడు చేసే ఖర్చు ఆ కథకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కథ బలహీనమైనప్పుడు చేసే ఖర్చు అనవసరమనిపిస్తుంది. 'సాహో' విషయంలో ఈ రెండొవదే జరిగింది. బలహీనమైన కథ .. అయోమయానికి గురిచేసే కథనంతో సాగే ఈ సినిమా, ఖర్చు విషయంలో మాత్రమే 'సాహో' అనిపిస్తుంది.

ఇటు యూత్ లోను .. అటు మాస్ ఆడియన్స్ లోను ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. 'బాహుబలి' నుంచి ఆయన క్రేజ్ సరిహద్దులు దాటింది. 'బాహుబలి 2' తరువాత బాగా గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేసిన సినిమా కావడంతో, 'సాహో'పై సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకోగలిగిందో ఇప్పుడు చూద్దాం.

ఈ కథ దుబాయ్ - 'వాజీ' ప్రాంతంలో మొదలవుతుంది. రాయ్ (జాకీష్రాఫ్) గ్యాంగ్ స్టర్ గా అక్కడ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటాడు. మరో గ్యాంగ్ కి చెందిన దేవరాజ్ (చుంకీ పాండే) రాయ్ సింహాసనాన్ని సొంతం చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న సమయంలోనే, ఒక ముఖ్యమైన పనిపై రాయ్ ఇండియాకి వస్తాడు. ఆ సమయంలోనే ఆయనకి సంబంధించిన రెండు లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్ గా ఈ దోపిడీ కేసును ఛేదించే బాధ్యతను అశోక్ చక్రవర్తి (ప్రభాస్) అమృత నాయర్ (శ్రద్ధా కపూర్) తీసుకుంటారు. అశోక్ చక్రవర్తి వ్యూహాలతో టీమ్ అంతా ముందుకు వెళుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే అమృత నాయర్ కి అశోక్ చక్రవర్తి గురించిన ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేమిటి? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు సుజీత్ తనకున్న కొద్ది అనుభవంతో చేసిన సాహసమే 'సాహో' అని చెప్పాలి. 'బాహుబలి' తరువాత ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అంతటి క్రేజ్ వున్న హీరోతో తనకున్న అనుభవంతో సుజీత్ ఇంతటి భారీ సినిమాను తెరకెక్కించడమనేది అంత ఆషామాషీ విషయం కాదు. అందుకనే సాహసమని అనాల్సి వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నప్పటికీ, దర్శకుడిగా ఆయన పూర్తి మార్కులను సంపాదించుకోలేకపోయాడనే చెప్పాలి.                                  


కథను పకడ్బందీగా తయారు చేసుకోవడంలో సుజీత్ విఫలమయ్యాడు. కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో తడబడ్డాడు. దాంతో ఏం జరుగుతుందో .. ఏ సన్నివేశానికి .. ఏ సన్నివేశానికి ముడి వేసుకోవాలో అర్థంకాక ప్రేక్షకులు అయోమయానికి లోనవుతారు. హీరో హీరోయిన్లకి సరైన కుటుంబ నేపథ్యాలు లేకపోవడం .. ప్రధాన పాత్రలను సరిగ్గా మలచకపోవడం .. దిగ్గజాల్లాంటి నటులను ఉపయోగించుకోలేకపోవడం .. కామెడీకి, రొమాన్స్ కి చోటు లేకపోవడం, పాత్రలు .. యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువైపోయి గందరగోళం ఏర్పడటం దర్శకుడి వైపు నుంచి ప్రధానమైన లోపాలుగా కనిపిస్తాయి.

ప్రభాస్ విషయానికొస్తే ఆయన తెరపై కనిపిస్తేనే ఆడియన్స్ ఊగిపోయారు. విజిల్స్ .. క్లాప్స్ తో థియేటర్ హోరెత్తిపోయింది. అంతటి క్రేజ్ వున్న ప్రభాస్, ఈ కథకి ఓకే చెప్పడమనేదే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక పాత్ర పరంగా చూసుకుంటే, అశోక్ చక్రవర్తి పాత్రలో ఆయన తన పాత్రకి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయాడు. అయితే లుక్ విషయంలో .. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. బరువు కూడా బాగా పెరిగిపోయి ఆయన ముఖం ఉబ్బరంగా కనిపిస్తోంది.

శ్రద్ధా కపూర్ విషయానికొస్తే, ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ ఆమెనే. స్క్రీన్ పై ఆమె చాలా అందంగా కనిపించింది. పాటల్లో ఆమె మరింత అందంగా మెరిసింది. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో బాగా చేసింది. ఇక జాకీ ష్రాఫ్ .. చుంకీ పాండే .. నీల్ నితిన్ ముఖేశ్ .. అరుణ్ విజయ్ .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ..  మందిరా బేడీ పాత్ర పరిధిలో ఓకే అనిపించారు.

ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది మధీ ఫొటోగ్రఫీ అని చెప్పాలి. విదేశీ లొకేషన్స్ ను .. పాటల్లోని లొకేషన్స్ ను .. ఛేజింగ్ సీన్స్ ను తెరపై ఆయన అద్భుతంగా అవిష్కరించి ఆశ్చర్యచకితులను చేశాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫరవాలేదు. ప్రభాస్ ఫస్టు ఫైట్ ఎపిసోడ్ ను .. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ నిడివిని ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. సంగీతం పరంగా చూసుకుంటే, 'నిన్నను మరిచేలా' పాట బాణీ కుదరలేదు .. మిగతా పాటలు ఫరవాలేదు. గిబ్రాన్ అందించిన రీ రికార్డింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ స్థాయిని పెంచింది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్  కెన్నీ బేట్స్ కంపోజ్ చేసిన యాక్షన్ .. ఛేజింగ్ ఎపిసోడ్స్, ఔరా! అనిపించేలా వున్నాయి.

పిండి కొద్ది రొట్టె మాదిరిగా కథను బట్టే ఖర్చు చేయాలి. కథ లేకుండా చేసే ఖర్చు, ఫసిఫిక్ లో కలిపిన పన్నీరు మాదిరిగా ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. పాత్రలు కథలో భాగమై .. బయటికి వచ్చిన తరువాత కూడా గుర్తుండిపోవాలిగానీ, థియేటర్లోనే మరిచిపోయేలా వుండకూడదు. ముఖ్యంగా కథ .. కథలోని మలుపులు సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థం కావాలి. తెరపై కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు, తెలుగు సినిమాలో హిందీ ఆర్టిస్టులు నటించినట్టు కాకుండా, హిందీ సినిమాలోనే ప్రభాస్ చేశాడా? అనే సందేహం కూడా కలుగుతుంది. కథను విడిచి సాము చేసిన 'సాహో' భారీ చిత్రంగా మిగిలిపోతుందేగానీ, భలే చిత్రమని మాత్రం అనిపించుకోదు!                            


Movie Name: Saaho

Release Date: 2019-08-30
Cast: Prabhas, Shraddha Kapoor, Jackie Shroff,Neil Nithin Mukesh, Arun Vijay, Chunky Pandey, Vennela Kishore, Murali Sharma
Director: Sujeeth
Music: Shankar Ehsaan Loy
Banner: UV Creations,T- Series

Saaho Rating: 2.75 out of 5

More Reviews