మొదటి నుంచి కూడా శర్వానంద్ ఒకే ఇమేజ్ చట్రంలో పడిపోకుండా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుతున్నాడు. అలాంటి శర్వానంద్ ఈ సారి 'రణరంగం' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావడమే ఆశ్చర్యం. వైవిధ్యం కోసం ఆయన ఈ కథను .. డిఫరెంట్ లుక్స్ తో కూడిన పాత్రను అంగీకరించి ఉంటాడు. కొత్తదనం కోసం ఆయన చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందన్నది చూడాలి.
కథలోకి వెళితే .. విశాఖలోని ఒక స్లమ్ ఏరియాలో దేవా (శర్వానంద్) అనాథగా పెరుగుతాడు. స్నేహితులతో కలిసి ఒక ఇంట్లో ఉంటూ, వాళ్లతోనే కలిసి సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ బతుకుతుంటాడు. ఆ ఏరియాలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తీర్చడానికి దేవానే ముందుంటాడు. అలాంటి దేవా ఆ ఏరియాకి కొత్తగా వచ్చిన గీత (కల్యాణి ప్రియదర్శన్) ప్రేమలో పడతాడు. అదే సమయంలో మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తూ, అదే వ్యాపారం చేస్తోన్న ఎమ్మెల్యే సింహాచలం (మురళీశర్మ)కి శత్రువుగా మారతాడు. అంతే కాకుండా రాజకీయంగానూ సింహాచలాన్ని దెబ్బకొట్టడానికి దేవా ప్రయత్నిస్తాడు. దాంతో దేవాను అంతం చేయడానికి సింహాచలం ప్లాన్ చేస్తాడు. పర్యవసానంగా చోటుచేసుకునే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
దర్శకుడు సుధీర్ వర్మ ఒక కథను అనుకుని దానిని అలా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికిగానీ, కథను అనూహ్యమైన మలుపులు తిప్పడానికిగాని ఆయన ప్రయత్నించలేదు. ఈ కథను ఆయన 1995లో మొదలుపెట్టి ప్రస్తుతానికి వస్తాడు. ఈ క్రమంలో గతం .. ప్రస్తుతం అంటూ ఆయన కొంతసేపు గతాన్నీ, ఆ తరువాత ప్రస్తుతాన్ని పదే పదే చూపించడం వలన సాధారణ ప్రేక్షకుడు అయోమయానికి లోనవుతాడు. స్క్రీన్ పై ప్రస్తుతం .. గతం అంటూ సీజీ వేసినా, అంతకుముందు సీన్ ఎక్కడ ఆగిపోయిందన్నది సాధారణ ప్రేక్షకుడికి గుర్తుండదు. ఈ స్క్రీన్ ప్లే సాధారణ ప్రేక్షకుడికి కాస్తంత గందరగోళాన్నే కలిగిస్తుంది.
ఇటు కల్యాణి పాత్రనుగానీ, అటు కాజల్ పాత్రను గాని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇక ఇద్దరు హీరోయిన్లకు ఒకే పేరు (గీత) పెట్టవలసిన అవసరం ఏంటనేది అర్థం కాదు. ఇక రాత్రివేళలో అటవీ మార్గంలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా జరిగే ఛేజ్ సీన్ ను, స్పెయిన్ లోని ఒక లిఫ్ట్ లో దేవాపై కిరాయి హంతకులు ఎటాక్ చేసే సీన్ ను మాత్రం చాలా బాగా చిత్రీకరించాడు. స్పెయిన్ లో ఆయన ఎంచుకున్న లొకేషన్స్ కూడా బ్యూటిఫుల్ గా వున్నాయి.
నటీనటుల విషయానికే వస్తే, దేవా పాత్రలో శర్వానంద్ యాక్షన్ ను .. ఎమోషన్ ను బాగా పండించాడు. స్లమ్ ఏరియా కుర్రాడిగాను, స్పెయిన్ లో స్థిరపడిన మధ్య వయస్కుడిగాను ఆయన నటనకి మంచి మార్కులు పడతాయి. స్లమ్ ఏరియా కుర్రాడిగా 1995 నాటి హెయిర్ స్టైల్ ఆయనకి కుదరలేదుగానీ, స్పెయిన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ లో మాత్రం ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇక గీత పాత్రలో కల్యాణి ప్రియదర్శన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు ఆశించే గ్లామర్ ఆమెలో కనబడలేదు. కాజల్ ను మరో హీరోయిన్ అనుకోలేము .. ఒక ఫ్రెండ్ గా మాత్రమే చివరివరకూ కనిపిస్తుంది. ఇక ఆ తరువాత చెప్పుకోవలసింది ప్రతినాయకుడిగా చేసిన మురళీశర్మ గురించే. ఎమ్మెల్యే సింహాచలం పాత్రలో ఆయన నటన కొత్తగా అనిపిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బ్రహ్మాజీ .. అజయ్ వంటివాళ్లు కనిపించిపోతుంటారు.
ఈ సినిమాకి సంగీతాన్ని .. రీ రికార్డింగును ప్రశాంత్ పిళ్లై అందించాడు. పాటల పరంగా చూసుకుంటే, గుర్తుండిపోయే పాటలేమీ లేవు. రీ రికార్డింగ్ మాత్రం బాగుంది. ప్రతి సన్నివేశంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లి ఆ సన్నివేశంతో పాటు ప్రేక్షకుడు ప్రయాణించేలా చేసింది. కథా పరంగా ప్రస్తుతంలో నుంచి గతంలోకి .. గతంలో నుంచి ప్రస్తుతంలోకి వచ్చేటప్పుడు ఎడిటింగ్ పరంగా కూడా మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఇక ఈ సినిమా పరంగా ఎక్కువ మార్కులు దక్కేది ఎవరికయ్యా అంటే సినిమాటోగ్రఫర్ దివాకర్ మణికే. స్పెయిన్ లోని అద్భుతమైన లొకేషన్స్ ను తెరపై ఆయన ఆవిష్కరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది.'నిన్ను పెంచారు .. నేను పెరిగాను' .. 'దేవుణ్ణి నమ్మాలంటే భక్తి కావాలి .. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి' .. 'ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే .. అందుకే దానికంత విలువ' వంటి సంభాషణలు బాగున్నాయి. 'మామా ప్రేమరా .. పెద్ద బాలశిక్షరా' పాటకి కొరియోగ్రఫీ మాస్ ను ఆకట్టుకునేలా వుంది.
సాధారణంగా శర్వానంద్ సినిమాలంటే ఇటు యూత్ .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తారు. కానీ ఈ రెండు వర్గాల ప్రేక్షకులకు దూరంగా ఈ కథను అల్లుకోవడం దర్శకుడు చేసిన పొరపాటుగా కనిపిస్తుంది. మద్యం అక్రమ రవాణా .. కాల్పులు .. కత్తులతో దాడులతో ఈ సినిమా యాక్షన్ మూవీస్ ను ఇష్టపడేవారికి పరిమితమైపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం .. కథనం ఆసక్తికరంగా సాగకపోవడం .. పాటల్లో పస లేకపోవడం నిరాశను కలిగించే అంశాలు. మురళీశర్మ నటనలో ప్రత్యేకతలే ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ. అవే మార్చేయడం అసంతృప్తిని కలిగించే విషయం. హోటల్లో మెనూ కార్డు చూసేంత కూడా చదువుకోని ఒక స్లమ్ ఏరియా యువకుడు, స్పెయిన్ లో ఎలా సెటిలయ్యాడనే లాజిక్ ను తీసి పక్కన పెట్టేస్తే, యాక్షన్ మూవీస్ ను ఇష్టపడేవారిని మాత్రం ఈ సినిమా నిరాశ పరచదు.
'రణరంగం' మూవీ రివ్యూ
| Reviews
Ranarangam Review
విశాఖలోని ఒక స్లమ్ ఏరియాలో అనాథగా పెరిగిన ఒక కుర్రాడు, తనని అభిమానించేవారికి అండగా నిలబడతాడు.
తనపై ఆధారపడినవాళ్ల కోసం స్మగ్లింగులోకి దిగిన ఆ యువకుడు, ఆ దారిలో ఎదురైన అవినీతి నాయకులతో తలపడుతూ గ్యాంగ్ స్టర్ గా మారతాడు. ఫలితంగా ఆ యువకుడికి ఎదురయ్యే పరిణామాలతో సాగే కథ ఇది. యాక్షన్ మూవీస్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చచ్చు.
Movie Name: Ranarangam
Release Date: 2019-08-15
Cast: Sharwanand, Kajal, kalyani Priyadarshan, Murali Sharma, Brahmaji, Ajay,
Director: Sudheer Varma
Music: Prashanth Pillai
Banner: Sitara Entertainments
Review By: Peddinti