'కథనం' మూవీ రివ్యూ

Kathanam

Kathanam Review

అనసూయ ఓ అందమైన, తెలివైన అమ్మాయి. దర్శకురాలిగా మారాలనే ఉత్సాహంతో ఒక కథను రాసుకుంటుంది. ఆ కథలో ఉన్నట్టుగానే, ఆ పాత్రల పేరుతో వున్న వాళ్లు వరుసగా మృత్యువాత పడుతుంటారు. అందుకు కారణాలను అన్వేషించే నేపథ్యంలో సాగే కథ ఇది. పేలవమైన సన్నివేశాలతో అల్లుకున్న 'కథనం' ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

సినిమా కోసం రచయిత ఒక కథను రాసుకోవడం .. ఆ స్క్రిప్టులో ఉన్నట్టుగానే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండటం వంటి కాన్సెప్టుతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అదే పాయింటును టచ్ చేస్తూ మరో కొత్త ట్విస్టుతో ముగింపు ఇవ్వడానికి దర్శకుడు రాజేశ్ నాదెండ్ల చేసిన ప్రయత్నంగా 'కథనం' కనిపిస్తుంది. కొత్తగా ఉంటుందని ఆయన అనుకున్న ఆ మలుపు, ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో .. అనసూయ కెరియర్ కి ఈ సినిమా ఏ మేరకు హెల్ప్ అవుతుందో పరిశీలిద్దాం.

అనసూయ (అనసూయ) తన చిన్ననాటి స్నేహితుడైన 'ధన' (ధన్ రాజ్)తో కలిసి ఒక ఇంట్లో అద్దెకి ఉంటూ ఉంటుంది. దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక కథను రాసుకుంటుంది. ఒక్కో పాత్ర ఒక్కో విధంగా మృత్యువాత పడుతుండటం గురించి ఆమె ఆ కథలో రాస్తుంది. ఆ కథలో ఆమె రాసినట్టుగానే, ఆ పాత్రల పేరుతో వున్న వారు ఆ విధంగానే మృత్యువు బారిన పడుతుంటారు. ఒకటి రెండు మరణాలు నిజంగానే జరగడంతో, ఆమె 'రణధీర్' (రణధీర్) అనే పోలీస్ ఆఫీసర్ ను కలిసి విషయం చెబుతుంది. కథలో వున్నట్టుగా బయట మరణాలు సంభవిస్తూ ఉండటం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చనిపోతున్న వాళ్లంతా ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వున్న వాళ్లని ఆ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీలో తెలుస్తుంది. దాంతో ఆయన నేరుగా శ్రీకాకుళం వెళతాడు. అక్కడ ఒక ఇంట్లో 'అరవింద' పేరుతో వున్న అనసూయ ఫొటో చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడి నుంచి మిగతా కథ అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది.

'కథనం' అనే టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు రాజేశ్ నాదెండ్ల సక్సెస్ అయ్యాడు. ఆయన డిజైన్ చేయించిన పోస్టర్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుండి అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. కానీ టైటిల్ కి తగిన ఉత్కంఠభరితమైన కథను ఆయన సిద్ధం చేసుకోలేకపోయాడు. విశ్రాంతి వరకూ కూడా ఈ సినిమా చాలా పేలవమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. విశ్రాంతి తరువాత కథలో మలుపులు ఎక్కువే వున్నాయిగానీ, ఆ సన్నివేశాలను ఒక స్టేజ్ పై చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడో ముగింపులో ట్విస్టు కోసమని ఇన్నేసి నాటకీయ పరిణామాలను సగటు ప్రేక్షకుడు భరించడం కష్టం.

అనసూయ చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతుంది. సాధారణంగా పాత్రలో కొత్తదనం ఉంటేనే తప్ప అనసూయ అంగీకరించదు. ఆమె చేసిందంటే కథలో ఏదో విషయం ఉందనే థియేటర్ కి వెళ్లే వాళ్లు వుంటారు. సినిమా చూసిన తరువాత ఇందులో ఆమెకి కొత్తగా అనిపించిన అంశం ఏమిటనే విషయం అర్థం కాదు. పాత్ర పరంగా చూసుకుంటే మాత్రం ఆమె మంచి ఎమోషన్స్ ను పండించింది. ఇక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆమెతో కూడా తిరిగే పాత్రలో ధన్ రాజ్ .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రణధీర్ .. అనసూయ భర్త పాత్రలో అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధిలో నటించారు. వెన్నెల కిషోర్ నవ్వించడానికి గట్టి ప్రయత్నమే చేశాడుగానీ, సన్నివేశాల్లో బలం లేకపోవడం వలన ఫలించలేదు.

ఇది సస్పెన్స్ తో కూడిన యాక్షన్ డ్రామా అయినప్పటికీ, ఆ దిశగా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది, కథలో బలం .. కథనంలో పట్టు లేకపోవడం వలన ప్రేక్షకులు అసహనంగా కదులుతారు. కామెడీకి అవకాశం ఉన్నప్పటికీ పండించలేకపోయారు .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలను రాసుకున్నా మెప్పించలేకపోయారు. కంటెంట్ లోనే బలం లేకపోవడం వలన, సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తాయి.  

Movie Name: Kathanam

Release Date: 2019-08-09
Cast: Anasuya, Avasarala Srinivas, Vennela Kishore, Dhan Raj, Ranadheer, Sameer, Jyothi
Director: Rajesh Nadendla
Music: Sunil Kashyap
Banner: Manthra Entertainments

Kathanam Rating: 1.25 out of 5

More Reviews