ఓటీటీ రివ్యూ: 'ది టీచర్' (నెట్ ఫ్లిక్స్)

The Teacher

The Teacher Review

  • నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది టీచర్'
  • అమలాపాల్ ప్రధాన పాత్రగా నడిచే సినిమా  
  • కమర్షియల్ అంశాలకు దూరంగా మలిచిన కథ  
  • ఆసక్తికరంగా లేని కథనం 
  • అమలా పాల్ నటనే ప్రధానమైన బలం 

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో అమలా పాల్ కి మంచి గుర్తింపు ఉంది. నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలో ఆల్రెడీ ఆమె తన సత్తా చాటుకుంది. పాత్రకి న్యాయం చేయడం కోసం తెరపై ఎలా కనిపించడానికైనా సిద్ధపడే ధైర్యం ఆమె సొంతం. అలాంటి అమలా పాల్ నుంచి వచ్చిన మలయాళ సినిమానే 'ది టీచర్'. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని సారాంశం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

దేవిక (అమలా పాల్) ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటుంది. ఆమె భర్త సుజీత్ ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు. దేవిక తన కష్టసుఖాలను తన తోటి ఉద్యోగిని అయిన గీతతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే సుజీత్ కూడా తన స్నేహితుడైన కెవిన్ తో చెప్పుకుంటూ ఉంటాడు. దేవిక స్కూల్లో ఓ సారి 'స్పోర్ట్స్ మీట్' జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలకి చెందిన స్కూల్స్ నుంచి విద్యార్థినీ విద్యార్థులు వస్తారు.

ఆ రోజున ఆ కార్యక్రమానికి సంబంధించిన పనుల్లో అలసిపోయిన దేవిక, ఇంటికి బయల్దేరే సరికి ఆలస్యమవుతుంది. వేరే స్కూల్ కి చెందిన టీనేజ్ కుర్రాళ్లు ఓ నలుగురు కలిసి మత్తు మందు ఇచ్చి దేవికను రేప్ చేస్తారు. ఈ సంఘటనను భర్తతో ఎలా చెప్పాలో తెలియక ఆమె తికమకపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం ఖరారు అవుతుంది. దాంతో ఆమె మరింత మానసిక ఒత్తిడికి గురవుతుంది.

ఆ నలుగురు స్టూడెంట్స్ ఏ స్కూల్ కి చెందినవారు? ఎక్కడ ఉంటున్నారు? తనని రేప్ చేసిన దృశ్యాలను వీడియో తీసి ఉంటారా? వాటిని అప్ లోడ్ చేస్తే తన పరిస్థితి ఏమిటి? అని ఆమె టెన్షన్ పడుతుంటుంది. ఈ విషయాన్ని ఖరారు చేసుకోవడానికిగాను ఆ నలుగురు స్టూడెంట్స్ లో ఒకరిని కలుసుకుంటుంది. తన రేప్ కి సంబంధించిన ఫొటోలు .. వీడియోలు వారి దగ్గర ఉన్నాయనే విషయాన్ని తెలివిగా రాబడుతుంది. 

ఈ లోగా దేవిక చేయించుకున్న ప్రెగ్నెన్సీ తాలూకు టెస్టు రిపోర్టు ఆమె భర్త కంటపడుతుంది. ఇంతటి ఆనందాన్ని కలిగించే విషయాన్ని తన భార్య తనతో చెప్పకుండా రిపోర్టు ఎందుకు దాచిందనే అనుమానం అతన్ని తొలిచేస్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్ కి వెళ్లి దేవికను చూసిన డాక్టర్ ను కలుస్తాడు. దేవిక తనకి అబార్షన్ చేయమని కోరిందనే విషయాన్ని ఆ డాక్టర్ ద్వారా విన్న సుజీత్ ఏం చేస్తాడు? ఆ నలుగురు స్టూడెంట్స్ విషయంలో దేవిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేదే కథ. 

మలయాళ ప్రేక్షకులు సహజత్వానికి దగ్గరగా సినిమాలు ఉండాలని కోరుకుంటారు. అందువలన అక్కడి సినిమాల్లో ఎక్కువగా లేనిపోని హడావిడి .. ఆర్భాటాలు కనిపించవు. కథ మన మధ్యలో పుట్టి .. మనమధ్యలో తిరుగుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. పాత్రలు కూడా మనకళ్ల ముందే తిరిగాడుతున్నట్టుగా ఉంటాయి. అందువలన వెంటనే కనెక్ట్ అవుతుంటాయి. అలా వాస్తవానికి దగ్గరగా ఆవిష్కరించిన సినిమానే 'ది టీచర్'. 

తన జీవితాన్ని నాశనం చేసిన నలుగురు స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఎలా గుణపాఠం చెప్పిందనే లైన్ పై నడిచిన ఈ కథ, సహజత్వానికి దగ్గరగా వెళుతుంది. హత్యాచారానికి గురైన ఒక స్త్రీని చుట్టుపక్కలవారు ఎలా చూస్తారు? ఆమెతో ఎలా ప్రవర్తిస్తారు? అప్పుడు ఆమె ఎంతటి మానసిక సంఘర్షణకి లోనవుతుందనేది దర్శకుడు చూపించాడు. ఓటమిని .. ఒంటరితనాన్ని జయించడం మొదలుపెడితే ఒక స్త్రీ మానసికంగా ఎంత బలపడుతుందనేది ఆవిష్కరించాడు. 

 ఈ సినిమాలో ఎక్కడా కమర్షియల్ అంశాలు కనిపించవు. మొదటి నుంచి చివరివరకూ ఒక సమస్య చుట్టూనే ఈ కథ సీరియస్ గా నడుస్తూ ఉంటుంది.  చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో  దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ సినిమాకి కేంద్రబిందువు అమలా పాల్ పాత్రనే. ఎమోషన్స్ తో కూడిన ఆమె నటన ఆకట్టుకుంటుంది. 

 ఒక పదేళ్ల పాపపై జరిగిన లైంగికదాడితో కథ మొదలవుతుంది. ఆ తరువాత ఆ ఎపిసోడ్ ఎక్కడా కనెక్ట్ కాదు .. ఎందుకు చూపించారనేది అర్థం కాదు. ఇక హీరో .. హీరోయిన్ భార్యాభర్తలు. వాళ్ల అనురాగాన్ని .. అన్యోన్యతను ఆవిష్కరించే ప్రయత్నం జరగలేదు. హీరోయిన్ కి ఎదురైన సమస్యతోనే ఆ ట్రాక్ మొదలై .. చివరివరకూ అదే మూడ్ లో నడుస్తుంది. కథాకథనాల పరంగా కొత్తదనం కనిపించని ఈ సినిమా, కథనం పరంగా కూడా ఆసక్తిని రేకెత్తించదు. కాకపోతే సహజత్వం విషయంలోనే కాస్త ఎక్కువ మార్కులు సంపాదించుకుంటుందంతే.

Movie Name: The Teacher

Release Date: 2022-12-23
Cast: Amala Paul, Hakkim Shah, Chemban Vinod, Manju Pillai
Director: Vivek
Music: Dawn Vincent
Banner: Nutmeg Productions

The Teacher Rating: 2.00 out of 5

More Reviews