ఈ మధ్య కాలంలో సత్యదేవ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి కూడా ఆయన వెనుకాడటం లేదు. 'గాడ్ ఫాదర్' సినిమా చూసిన వాళ్లంతా, విలన్ తరహా పాత్రలు కూడా ఆయన బాగా చేయగలడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాంటి సత్యదేవ్ ప్రస్తుతం తనకి గల క్రేజ్ కి భిన్నంగా ఒక లవ్ స్టోరీ చేశాడు. ఆ సినిమా పేరే 'గుర్తుందా శీతాకాలం'.
సత్యదేవ్ తో పాటు ట్రావెల్ అయ్యే పాత్రలలో తమన్నా .. మేఘ ఆకాశ్ .. కావ్య శెట్టి కనిపిస్తారు. భావన రవి .. రామారావు నిర్మించిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. తన ఇమేజ్ కి భిన్నంగా సత్యదేవ్ చేసిన ఈ సినిమా, ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం.
కథలోకి వెళితే .. దేవ్ (సత్యదేవ్) మంగుళూరుకి వెళుతూ ఉండగా, మార్గమధ్యంలో దివ్య (మేఘ ఆకాశ్) తారసపడుతుంది. ఆమె కూడా అదే రూట్లో వెళ్లవలసి ఉండటంతో లిఫ్ట్ అడుగుతుంది. ఆ ప్రయాణంలోనే వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆయన లైఫ్ లో లవ్ స్టోరీ ఉందని గ్రహించిన దివ్య, ఆ విషయాలు చెప్పమని అడగడంతో .. దేవ్ చెప్పడం మొదలుపెడతాడు. అలా అసలు కథ మొదలవుతుంది.
స్కూల్ డేస్ నుంచి కూడా దేవ్ కి లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తరువాత బెంగుళూరులో జాబ్ చేస్తూ ఉండగా, అమృత (కావ్య శెట్టి)తో పరిచయం ప్రేమగా మారుతుంది. శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమృత, తన స్థాయికి తగిన వ్యక్తిని చూసుకుని దేవ్ కి దూరమైపోతుంది. ఆ బాధలో ఉన్న అతనికి నిధి (తమన్నా) చేరువవుతుంది. బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె, అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది.
తన స్నేహితుడైన ప్రశాంత్ (ప్రియదర్శి) ద్వారా నిధికి దేవ్ చేరువవుతాడు. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. అయితే దేవ్ ను దూరం చేసుకున్న అమృత తిరిగి అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. తన తప్పు తెలుసుకుని వచ్చానంటూ అతణ్ణి ఒత్తిడి చేస్తుంది. అప్పుడు దేవ్ ఏం చేస్తాడు? లైఫ్ లో సెటిలై .. వైఫ్ తో హ్యాపీగా రోజులు గడపాలనుకున్న ఆయన జీవితం ఎలాంటి అనూహ్యమైన మలుపు తిరిగిందనేదే కథ.
ఒక హీరోయిన్ తో ప్రేమ .. మరో హీరోయిన్ తో పెళ్లి .. మూడో హీరోయిన్ తో హీరో ఈ విషయాలను పంచుకోవడమే ప్రధానంగా ఈ కథ మనకి కనిపిస్తుంది. దర్శకుడు నాగశేఖర్ విషయానికి వస్తే, ఆయన తయారు చేసుకున్న కథలోను .. పాత్రలకి తగిన ఆర్టిస్టులను ఎంచుకోవడంలోను .. క్లైమాక్స్ లోను లోపాలు కనిపిస్తాయి. ఈ కారణంగానే సినిమాకి వెళ్లిన ప్రేక్షకుడు ఎక్కడా కూడా కనెక్ట్ కాలేకపోతుంటాడు.
కథ ఎత్తుకోవడమే కాస్త కృతకంగా అనిపిస్తుంది. ఏ మాత్రం పరిచయం లేని హీరోతో మేఘ ఆకాశ్ చనువుగా మాట్లాడేసి ఆయన జీప్ ఎక్కేయడం .. ఆయన లవ్ స్టోరీ వింటూ ఎంజాయ్ చేయడం, తన ఫస్టు నైట్ తో సహా శుభం కార్డు వరకూ ఆయన చెప్పడం కాస్త అసహజంగా అనిపిస్తుంది. ఇక రెండో హీరోయిన్ కావ్యశెట్టి పాత్రను కూడా డైరెక్టర్ సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. దేవ్ దగ్గర డబ్బులేదని తెలిసే ప్రేమిస్తుంది .. డబ్బులేదనే దూరమవుతుంది .. డబ్బులేకపోయినా ఫరవాలేదు అంటూ మళ్లీ చెంత చేరడానికి ట్రై చేస్తుంది. ఆమె ఉద్దేశం ఏమిటనేది అర్థం కాదు.
ఇక తమన్నా పాత్ర విషయంలోను ఇదే తంతు. హీరో సిన్సియర్ లవర్ అని తెలిసే పెళ్లి చేసుకుంటుంది. తను బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పల్లెటూరి భార్య మాదిరిగా అలుగుతుంది. సాఫ్ట్ వేర్ జాబ్ చేసిన ఆమె .. అక్కడి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనేది తెలియనట్టుగా మాట్లాడుతుంది. తమన్నా ట్రాక్ లో మంచి రొమాన్స్ ను ఆశిస్తూ ప్రేక్షకులు కూర్చుంటే, అదేదో జబ్బుపేరు చెప్పి ఆమెకి జుట్టు లేకుండా చూపించారు.
అసలు ఇది సత్యదేవ్ చేసే సినిమా కాదు .. ఆయన చేసే పాత్ర కాదు. ఆయనకి మీసాలు తీసేసి కాలేజ్ కుర్రాడు అనుకోండి అంటే .. ఈ ట్రెండ్ లో కష్టమే. ఆయన ఒక పాత స్కూటర్ పై తిరుగుతూ ఉంటే అసలు ఈ కథ ఏ కాలంలో నడుస్తుంది? అనే డౌట్ రాకమానదు. ఆయన సరసన నాయికగా తమన్నా సెట్ కాలేదు .. కావ్య శెట్టి అసలే సెట్ కాలేదు. మేఘ ఆకాశ్ శ్రోత మాత్రమే కావడం వలన ఆ పిల్ల జోలికి మనం వెళ్లకూడదు.
ఒక్క ఫైటూ లేకపోతే బాగుండదేమో అన్నట్టుగానే ఒక ఫైట్ పెట్టారు. అదికూడా అతికించినట్టుగానే ఉంది. ఇలా కథాకథనాలు .. పాత్రల స్వరూప స్వభావాలు ప్రేక్షకుల ఫీలింగ్స్ తో పనిలేకుండా ముందుకు వెళ్లిపోతాయి. కాలభైరవ స్వరపరిచిన పాటల్లో చెప్పుకోదగిన ట్యూన్ ఏదీ కనిపించదు. సత్య హెగ్డే ఫొటోగ్రఫీ .. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఫరవాలేదు. ప్రేక్షకులకు మిగతా విషయాలేవీ పెద్దగా గుర్తుండిపోవుగానీ, ఈ కథ శీతాకాలంలో జరుగుతుందనే విషయాన్ని మాత్రం మరిచిపోరు. ఎందుకంటే హీరోనే తరచూ గుర్తుచేస్తుంటాడు కాబట్టి.
మూవీ రివ్యూ: 'గుర్తుందా శీతాకాలం'
| Reviews

Gurthunda Seethakalam Review
- రొమాంటిక్ డ్రామాగా వచ్చిన 'గుర్తుందా శీతాకాలం'
- బలహీనమైన కథాకథనాలు
- సత్యదేవ్ కి నప్పని పాత్ర
- తమన్నా పాత్ర విషయంలో అదో పెద్ద మైనస్
Movie Name: Gurthunda Seethakalam
Release Date: 2022-12-09
Cast: Sathyadev, Thamannah, Megha Akash, Kavya Shetty, Suhasini
Director: Nagasekhar
Music: Kalabhairava
Banner: Sri Vedakshara Movies
Review By: Peddinti
Gurthunda Seethakalam Rating: 2.25 out of 5
Trailer