ఓటీటీ రివ్యూ 'రిపీట్' (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

Repeat

Repeat Review

  • తమిళంలో తెరకెక్కిన 'డెజావు'
  • తెలుగు రీమేక్ గా వచ్చిన 'రిపీట్'
  • ప్రధానమైన పాత్రను పోషించిన నవీన్ చంద్ర
  • బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా 
  • కంటెంట్ పరంగా కట్టిపడేసే కథ

తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన విభిన్నమైన కథా చిత్రాలలో 'డెజావు' ఒకటి. వైట్ కార్పెట్ ఫిలిమ్స్  .. పీజీ మీడియా వర్క్స్ వారు ఈ సినిమాను నిర్మించగా, అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జులై 22వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి వచ్చిది. థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టులో ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అయింది. 

ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసి 'రిపీట్' టైటిల్ తో 'డిస్నీ హాట్ స్టార్' లో వదిలారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. తమిళంలో అరుళ్ నిథి చేసిన ప్రధానమైన పాత్రను తెలుగులో నవీన్ చంద్రతో చేయించారు. తమిళంలో అరుళ్ నిథి కాంబినేషన్ లోని సన్నివేశాలను మాత్రమే ఇక్కడ నవీన్ చంద్రతో రీమేక్ చేసి. మిగతాది యథాతథంగా ఉంచేశారు.

ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. సుబ్రమణ్యం (అచ్యుత్ కుమార్) అనే సీనియర్ రైటర్, ఓ రోజు రాత్రి ఫుల్లుగా తాగేసి పోలీస్ స్టేషన్ కి వస్తాడు.  తాను రైటర్ ననీ .. ప్రస్తుతం ఒక కథ రాస్తున్నానని చెబుతాడు. అయితే ఆ కథలోని పాత్రలు బయటికి వచ్చి, తనకి బెదిరింపు కాల్స్ చేస్తున్నాయని ఫిర్యాదు చేస్తాడు. స్టేషన్ లోని వాళ్లంతా ఆయన మాటలను సిల్లీగా తీసుకుని కొట్టిపారేస్తారు. 

అయితే అతను ఆ కథలో రాసినట్టుగానే డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కూతురు పూజ (స్మృతి వెంకట్) కిడ్నాప్ కి గురవుతుంది. ఈ విషయం బయటికి రాకుండా ఈ కేసును ఛేదించడానికి అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కుమార్ (నవీన్ చంద్ర) ను రంగంలోకి దింపుతుంది. అయితే ఆ విషయం కూడా అప్పటికే ఆ రైటర్ రాయడం ఆశా ప్రమోద్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన కూతురు కిడ్నాప్ కి గురికావడం వెనుక ఆ రైటర్ హస్తం ఉందని ఆమె అనుమానిస్తూ ఉంటుంది.

పూజ కిడ్నాప్ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన విక్రమ్ కుమార్, ఎవరో విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఒక రైటర్ తన కథలో రాసిన విషయాలు ఎలా నిజమవుతున్నాయనే విషయంపై దృష్టి పెడతాడు. అలాగే డీజీపీ ఆశా ప్రమోద్ కూడా తన దగ్గర ఏవో నిజాలు దాస్తోందని గ్రహిస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? చివరికి అతనికి తెలిసే చేదు నిజాలేమిటి? అనేదే కథ. 

దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ తయారు చేసుకున్న ఈ కథ, చాలా సింపుల్ గా మొదలవుతుంది. నిదానంగా మొదలైన కథ .. ఎప్పటికప్పుడు మరింత చిక్కబడుతూ .. ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలైన ట్విస్టులు ఎండ్ కార్డు పడేవరకూ కొనసాగుతూనే ఉంటాయి ... ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంటాయి. 

చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో .. తక్కువ బడ్జెట్ లో దర్శకుడు కథను రెడీ చేసుకున్న తీరు .. ఎక్కడా ఎవరూ గెస్ చేయడానికి వీల్లేని విధంగా కథనాన్ని నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పీజీ ముత్తయ్య కెమెరా పనితనం ప్రేక్షకులు ఈ కథను మరింత ఇంట్రెస్టింగ్ గా ఫాలోకావడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. నిజానికి ఈ కథ ఏ మాత్రం కాస్త అటు ఇటు అయినా కన్ఫ్యూజ్ అయ్యే కథ. అయినా అరుళ్ సిద్దార్థ్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. 

కథలో ఏ పాత్ర కూడా అతిగా .. అనవసరంగా మాట్లాడదు. సన్నివేశాలు సందర్భాన్ని దాటి వెళ్లవు.  కథ .. పాత్రలు సహజత్వానికి దగ్గరగా నడుస్తూ ఉండటం వలన, ఈ కథ మన మధ్యలో జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అనేవి దండలో దారంలా ఉంటాయి.  ఈ మూడూ కూడా సస్పెన్స్ ను ముందుపెట్టుకుని నడుస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటాయి. 

నవీన్ చంద్ర .. మధుబాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఇటీవల వచ్చిన 'కాంతార'లో దొరవారు పాత్రను పోషించిన అచ్యుత్ కుమార్ కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ మూడు పాత్రలే ప్రధానంగా కథ నడుస్తూ ఉంటుంది. ఎవరి పాత్ర పరిధిలో వారు చాలా బాగా చేశారు. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా చిన్న సినిమానే అయినా, కంటెంట్ పరంగా బలమైన సినిమా ఇది. మొదటి నుంచి చివరివరకూ ప్రేక్షకులను కట్టిపడేసే కథ ఇది.

Movie Name: Repeat

Release Date: 2022-12-01
Cast: Naveen Chandra, Madhubala, Achyuth Kumar, Smruthi Venkat
Director: Arvindh Srinivasan
Music: Ghibran
Banner: PG Media Works

Repeat Rating: 2.50 out of 5

Trailer

More Reviews