మూవీ రివ్యూ 'సర్దార్

Sardar

Sardar Review

  • ఈ శుక్రవారమే విడుదలైన 'సర్దార్'
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • తండ్రీ కొడుకులుగా మెప్పించిన కార్తి 
  • రొమాన్స్ ను ..  కామెడీని టచ్ చేయని డైరెక్టర్
  • ఆసక్తికరంగా సాగిన కథాకథనాలు

కార్తి హీరోగా రూపొందిన 'సర్దార్' సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి , పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. సీనియర్ కార్తీ జోడీగా రజీషా విజయన్ కనిపిస్తే, జూనియర్ కార్తి సరసన రాశి ఖన్నా అలరించింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా చుంకీ పాండే నటించాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా నిన్ననే విడుదలైంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.

రాథోడ్ (చుంకీ పాండే) ఇండియాలో 'వన్ ఇండియా వన్ పైప్ లైన్' అనే ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. ప్రైవేటు సంస్థల చేతుల్లోకి మంచినీళ్లు వెళితే భవిష్యత్తు తరాల వారు మరింత ప్రమాదంలో పడతారని భావించిన ఇద్దరు 'రా' మాజీ ఆఫీసర్లు ఆందోళన చెందుతూ ఉంటారు. మంచినీళ్ల చుట్టూ మాఫియా చేరకూడదంటే 'సర్దార్' ( సీనియర్ కార్తి) రావలసిందేనంటూ అతని రాకపోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సమీరా (లైలా) 10 ఏళ్ల కొడుకు ఒక రకమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. వాటర్ బాటిల్స్ లోని వాటర్ తాగడం వలన వచ్చిన జబ్బు అది. 

దాంతో సమీర కూడా తన బిడ్డలాంటి పరిస్థితి మరొకరికి రాకూడాదనే ఉద్దేశంతో 'వన్ ఇండియా వన్ పైప్ లైన్' అనే ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. 'సర్దార్' కి చేర్చవలసిన సమాచారం కోసం 'రా' మాజీ అధికారులతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఆ సర్దార్ తనయుడు విజయ్ ( జూనియర్ కార్తి) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. తన తండ్రిని అంతా దేశ ద్రోహిగా చెప్పుకుంటూ ఉండటం .. ఆ అవమానాన్ని భరించలేక మిగతా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడం అతనికి ఎంతో బాధను కలిగిస్తూ ఉంటుంది. 32 ఏళ్లుగా జైలులో మగ్గుతున్న 'సర్దార్',  సమీర పంపిన ఒక సమాచారం కారణంగా, జైలు నుంచి తప్పించుకుంటాడు. 

'సర్దార్ ' గతం ఏమిటి? ఆయన జైలుకు వెళ్లడానికి కారకులు ఎవరు? జైలు నుంచి ఆయన బయటపడిన తరువాత ఏం జరుగుతుంది? తన తండ్రి గురించి ఈ లోకం చెప్పుకుంటుందంతా అబద్ధమని తెలుసుకున్న విజయ్ ఏం చేస్తాడు? వంటి ఆసక్తికరమైన మలుపులతో మిగతా కథ నడుస్తుంది. విశాల్ హీరోగా 'ఇరుంబు తిరై' .. శివ కార్తికేయన్ తో 'హీరో' సినిమాను తెరకెక్కించిన పీఎస్ మిత్రన్, తన మూడో సినిమాగా 'సర్దార్' సినిమాను రూపొందించాడు.

పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మొదటి నుంచి చివరి వరకూ సీరియస్ గా సాగుతుంది. ఎక్కడా రొమాన్స్ కి గానీ .. కామెడీకి గాని అవకాశం ఇవ్వకుండా కథ ముందుకు కదులుతూ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ .. ఎవరి వైపు నుంచి రొమాన్స్ ను రాబట్టడానికి దర్శకుడు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇక కామెడీకి కాలు పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. జబ్బుతో బాధపడే సమీర ఒక్కగానొక్క కొడుకు వైపు నుంచి ఎమోషన్ ను కనెక్ట్ చేశారు. విస్తారమైన కథనే తీసుకున్నప్పటికీ సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఈ కథను ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

కథ మొదలైన దగ్గర నుంచి 'సర్దార్' పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆయన పాత్ర ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇస్తుంది. ఆ పాత్ర ఇంట్రడక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో చూపించారు. 'సర్దార్' ... 'విజయ్' పాత్రల మధ్య వేరియేషన్స్ ను చూపించడంలోను, ఈ రెండు పాత్రలతో సమీర కొడుకు పాత్రను ట్రావెల్ చేయించడంలోను .. అందుకు తగిన స్క్రీన్ ప్లే ను పట్టుగా నడిపించడంలోనూ దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు. తండ్రీ కొడుకులుగా కార్తి రెండు పాత్రలలోను కట్టి పడేస్తాడు. ఇక విలన్ గా చుంకీ పాండే నటన కూడా ఆకట్టుకుంటుంది. 

జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన పాటలు అంతగా ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కథతో పాటు పరుగులు తీయిస్తుంది. జార్జ్ విలియమ్స్ కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలను ఆయన చిత్రీకరించిన తీరు కట్టిపడేస్తుంది. ఎడిటింగ్ పరంగా చూసుకోవాలంటే కథలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా నీట్ గా అనిపిస్తుంది. కామెడీ ... రొమాన్స్ .. సరైన సాంగ్స్ లేకపోయినా అదో లోటుగా అనిపించదు. అంతటి ఆసక్తికరంగా కథాకథనాలు నడుస్తూ .. ఆడియన్స్ కి సంతృప్తికరంగా అనిపించే ముగింపునే తీసుకుంటుంది.

Movie Name: Sardar

Release Date: 2022-10-21
Cast: Karthi, Rashi Khanna, Rajeesha Vijayan, Chunky Pandey
Director: P S Mithran
Music: G V Prakash Kumar
Banner: Prince Pictures

Sardar Rating: 3.00 out of 5

Trailer

More Reviews