హీరోగా విష్వక్ సేన్ .. ఒక ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ నటించిన 'ఓరి దేవుడా' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీవీపీ వారు నిర్మించిన ఈ సినిమాకి అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. తెలుగులో ఇది ఆయనకి మొదటి సినిమా. ఇక ఈ సినిమాతో మిథిల పాల్కర్ .. ఆషా భట్ కథానాయికలుగా పరిచయమయ్యారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఫాంటసీ టచ్ తో నడుస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో, ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది చూద్దాం.
జీవితంలో భరించలేని బాధ ఎదురైనప్పుడు 'ఓరి దేవుడా' అంటూ నిట్టూర్చడం జరుగుతూ ఉంటుంది. ఆ దేవుడిని సైతం నిందించడం జరుగుతూ ఉంటుంది. జరిగిన పొరపాట్లు సరిచేసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకోవడం సహజం. అలాంటి కోరికను ఒక యువకుడు కోరుకుంటే .. ఆ భగవంతుడు నిజంగానే అతనికి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా.
అర్జున్ (విష్వక్ సేన్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అనూ (మిథిలా పాల్కర్) ఓ బిజినెస్ మేన్ కూతురు. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన మణి (వెంకటేశ్ కాకుమాను) ప్రోత్సాహంతో ఇద్దరూ కూడా మరింత దగ్గరవుతారు. పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే నిర్ణయాన్నికి వస్తారు. రెండు కుటుంబాల వారు అంగీకరించడంతో పెళ్లి చేసుకుంటారు. అనూ తండ్రి తన సంస్థలోనే అర్జున్ కి జాబ్ కూడా ఇస్తాడు. అయితే అర్జున్ కి ఆ జాబ్ చేయడం ఇష్టం ఉండదు. తనకి ఇష్టమైన యాక్టింగ్ వైపు వెళ్లాలని అతను అనుకుంటూ ఉంటాడు.
అదే సమయంలో స్కూల్ రోజుల్లో తనకి సీనియర్ అయిన మీరా ( ఆషా భట్) అతనికి తారసపడుతుంది. పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో ఆమె పనిచేస్తూ ఉంటుంది. నటన దిశగా ఆమె అర్జున్ ను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో అతను మీరాతో చనువుగా ఉండటం పట్ల అనూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ కారణంపైనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగి విడాకుల వరకూ వెళతారు. ఆ సందర్భంలోనే దేవుడు (వెంకటేశ్) ను కలుసుకునే ఒక అవకాశం అర్జున్ కి వస్తుంది. ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడం తన తప్పనీ .. అందులో దేవుడు తప్పు కూడా ఉందని అర్జున్ అంటాడు.
అయితే జీవితాన్ని మార్చుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తానని చెబుతూ అతనికి దేవుడు ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ ఎప్పుడూ అతనితోనే ఉండాలనీ .. తమ మధ్య జరిగిన సంభాషణ ఎవరికీ చెప్పొద్దనీ .. చెబితే అతను మరణించడం ఖాయమని అంటాడు. దాంతో ఆ టికెట్ తీసుకుని బయటపడిన అర్జున్ .. అనూతో పెళ్లికి ముందు రోజులకు వెళతాడు .. అనూతో పెళ్లికి నిరాకరిస్తాడు. దాంతో అనూ తన తండ్రి చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. మీరాను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో అర్జున్ ఉంటాడు. కొత్తగా మొదలైన ఈ కథలో ఎలాంటి మలుపులు ఉంటాయి? ఎలాంటి గమ్యానికి చేరుకుంటుందనేదే ఇక్కడ ఆసక్తికరం.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు తయారు చేసుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. విలన్ లేకుండా .. యాక్షన్ తో పెద్దగా పని లేకుండా ఆయన అల్లుకున్న కథ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అనూతో కలిసి జీవించడం ఇష్టం లేని అర్జున్, దేవుడు ఇచ్చిన ఛాన్స్ వలన, ఆమెకి దూరంగా బ్రతకాలనుకుంటాడు. ఆ సమయంలో అర్జున్ కి ఎదురయ్యే అనుభవాలతో సెకండాఫ్ ఆసక్తికరంగా నడుస్తుంది. అయితే ఫస్టాఫ్ లో కథనం నిదానించడం వలన సీట్లలో ప్రేక్షకులు కాస్త అసహనానికి లోనవుతారు. ఫస్టాఫ్ లో కథనం వేగంగా కదులుతూ ఉంటే బాగుండేది. ప్రధానమైన పాత్రలలో కొత్త కోణాలను టచ్ చేస్తూ .. మరో వైపు నుంచి క్లైమాక్స్ కి తీసుకొచ్చిన తీరు బాగుంది.
విష్వక్సేన్ సినిమా అంటే ఇలాగే ఉంటుందనే ఒక మార్కు .. మాట ఉన్నాయి. అందుకు భిన్నంగా ఆయన ఎంచుకున్న కథ .. పాత్ర ఇది. తనదైన బాడీ లాంగ్వేజ్ ను వదులుకోకుండానే సునిన్నతమైన భావోద్వేగాలను బాగా పలికించాడు. ఇక కథానాయికలు ఇద్దరూ తెలుగు తెరకి కొత్త. గ్లామరస్ హీరోయిన్స్ కాకపోవడం ఆడియన్స్ కి కాస్త అసంతృప్తిని కలిగించే విషయమే. అయితే మిథిలా పాల్కర్ నటనను ఈ సినిమాకి హైలైట్ గ్గా చెప్పుకోవచ్చు. ఆమె నటన చూస్తుంటే 'కలర్స్ స్వాతి గుర్తుకు రావడం ఖాయం. ఇక ఆషా భట్ పాత్ర పరిధిలో మెప్పించింది. విష్వక్ సేన్ ఫ్రెండ్ పాత్రలో వెంకటేశ్ కాకుమాను ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్రనే చేశాడు.
లియోన్ జేమ్స్ అందించిన పాటలు ఫరవాలేదు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. విధు అయ్యన కెమెరా పనితనం బాగుంది. ముఖ్యంగా కేరళ లొకేషన్స్ ను అద్భుతంగా చిత్రీకరించాడు .. ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. దేవుడి అసిస్టెంట్ కోర్టులో ఉన్న హీరో దగ్గరికి వచ్చి మరీ దేవుడి అడ్రెస్ ఇచ్చివెళ్లడం వెనుక ఎలాంటి లాజిక్ లేకపోవడమనే విషయాన్ని పక్కన పెడితే, ఫస్టాఫ్ లో కథనం కాస్త నిదానించినా పట్టించుకోకపోతే .. హీరోయిన్స్ నుంచి గ్లామర్ ఆశించకుండా వెళితే, ఫరవాలేదు అనుకుంటూ థియేటర్లో నుంచి బయటికి రావొచ్చు.
మూవీ రివ్యూ : 'ఓరి దేవుడా..!'
| Reviews
Ori Devuda Review
- ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చిన 'ఓరి దేవుడా'
- ఫాంటసీ టచ్ తో నడిచే ప్రేమకథ
- గ్లామర్ పరంగా ఆకట్టుకొని కథానాయికలు
- నటన పరంగా మిథిల పాల్కర్ కి ఎక్కువ మార్కులు
- ప్రత్యేకమైన పాత్రలో మెరిసిన వెంకటేశ్
- కథనం పరంగా ఫస్టాఫ్ లో లోపించిన వేగం
Movie Name: Ori Devuda
Release Date: 2022-10-21
Cast: Vishwak Sen, Mithila, Asha Bhatt, Venkatesh, Rahula Ramakrishna, Venkatesh kakumanu, Murali Sharma
Director: Ashwath Mari Mutthu
Music: Leon Jems
Banner: PVP
Review By:
Ori Devuda Rating: 2.50 out of 5
Trailer