మూవీ రివ్యూ: 'స్వాతిముత్యం'

Swathimuthyam

Swathimuthyam Review

  • ఈ బుధవారమే విడుదలైన 'స్వాతిముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • ఆసక్తికరంగా అల్లుకున్న కథాకథనాలు 
  • సున్నితమైన కామెడీ హైలైట్ 
  • పాటలకి మంచి మార్కులు
  • మౌత్ టాక్ తో పుంజుకోవలసిన సినిమా ఇది

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' సినిమా రూపొందింది. సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్త్వం వహించాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. కామెడీని టచ్ చేస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఒక వైపున చిరంజీవి 'గాడ్ గాడ్ ఫాదర్' ... మరో వైపున నాగార్జున 'ది ఘోస్ట్'  రంగంలోకి దిగుతున్నప్పుడు, తొలి సినిమాతో .. తక్కువ బడ్జెట్ తో బెల్లంకొండ గణేశ్ కూడా బరిలోకి దిగడం సాహసమే. ఈ కథపై ఆయనకి గల నమ్మకం ఎంతవరకూ నిలబడిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 'పిఠాపురంలో మొదలవుతుంది. బాలమురళీ (బెల్లంకొండ గణేశ్) చాలా సాఫ్ట్. పవర్ స్టేషన్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. బాలమురళీకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో అతని పేరెంట్స్ ( రావు రమేశ్ - ప్రగతి) రంగంలోకి దిగుతారు. భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ను నచ్చుకున్న బాలమురళీ, ఆమెపట్ల తనకి గల ఇష్టాన్ని తెలియజేస్తాడు. పెళ్లి తరువాత అత్తింటివారి నుంచి తనపై ఆంక్షలు ఉండకూడదని భాగ్యలక్ష్మి భావిస్తుంది. అయితే పెళ్లి తరువాత తాను జాబ్ చేయడం .. డ్రెస్ లు వేసుకోవడం అత్తగారికి నచ్చదని తెలుసుకున్న భాగ్యలక్ష్మి ఈ సంబంధం పట్ల వెనక్కి తగ్గుతుంది. 

అయినా బాలమురళీ మాత్రం భాగ్యలక్ష్మి చుట్టూ తిరిగి .. తనతో ఆమెను పెళ్లికి ఒప్పించడానికి నానా తిప్పలు పడుతుంటాడు. బాలమురళీకి ఎలాంటి చెడు అలవాట్లు లేవని భాగ్యలక్ష్మి నిర్ధారించుకుంటుంది. అతనిలో కొంత అమాయకత్వం .. అంతకు మించిన నిజాయితీ ఉందని గ్రహిస్తుంది. తాను తప్ప అతని జీవితంలోకి అంతవరకూ ఏ అమ్మాయి  అడుగుపెట్టలేదని నమ్ముతుంది. ఇలా అన్నిరకాలుగా అతనిని పరిశీలించి పెళ్లికి అంగీకరిస్తుంది. దాంతో చకచకా పెళ్లి పనులు మొదలవుతాయి. బంధుమిత్రులు అందరూ వచ్చేస్తారు. మరి కాసేపట్లో పెళ్లి అనగా, తన కోసం శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి తన ఆఫీసుకి వచ్చినట్టుగా బాలమురళీకి కాల్ వస్తుంది. 

శైలజ పేరు వినగానే బాలమురళీ కంగారు పడతాడు. వెంటనే తన ఆఫీసుకి చేరుకుంటాడు. అక్కడ పసిబిడ్డతో ఉన్న శైలజను చూసి షాక్ అవుతాడు. విషయమేవిటని కంగారుగా అడుగుతాడు. అతని వలన తనకి కలిగిన బిడ్డను అతనికే అప్పగించడానికి వచ్చానని శైలజ చెబుతుంది. మరి కాసేపట్లో తనకి పెళ్లి జరగబోతోందనీ .. అలాంటి సమయంలో వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదని బాలమురళీ ప్రాథేయపడతాడు. తన జీవితం కూడా తనకి చాలా ముఖ్యమనీ, అందువల్లనే ఆ బిడ్డను వదిలించుకుని వెళదామని వచ్చానంటూ ఆమె  తేల్చి చెబుతుంది. అప్పుడు బాలమురళీ ఏం చేస్తాడు? అంతకుముందు వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.

హీరో .. హీరోయిన్ తమ ప్రేమను పెళ్లిపీటల వరకూ తీసుకుని వెళ్లడం, మరి కాసేపట్లో ఆ మూడు ముళ్లు పడతాయనగా ఒక అవాంతరం ఎదురుకావడం ... దానిని అధిగమించడానికి వాళ్లు నానా కష్టాలు పడటం అనే కథాంశంతో గతంలో చాలానే కథలు వచ్చాయి. ఈ కథ కూడా అలాంటిదే. కాకపోతే హీరో .. హీరోయిన్ పెళ్లికి అడ్డుపడే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దర్శకుడు ఆ సీరియస్ సమస్యకి కామెడీని జోడించి నడిపించిన తీరు మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. పెద్దగా అనుభవం లేకపోయినా దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా నీట్ గా చెప్పాడు. ఎక్కడ ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేలా ఈ కథను తీర్చిదిద్దాడు.

ఇక హీరో .. హీరోయిన్ తో పాటు ప్రధానమైన పాత్రలన్నింటికీ తగిన ప్రాధాన్యత కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఈ కథ నడుస్తూ ఉంటుంది గనుక, ఆ యాసను ఆయన ఎక్కడా మిస్ చేయలేదు. ఎవరి ఇగోను వారు చల్లార్చుకోవడానికి పడే అవస్థలను చూపిస్తూ హాయిగా నవ్వించాడు. వెన్నెల కిశోర్ ... గోపరాజు రమణ కామెడీ బాగా వర్కౌట్ అయింది. తనకి ఇష్టమైనవారి మెడలో తన పులిగోరును వేసి .. తనకి కోపం వచ్చినప్పుడు తిరిగి తీసేసుకునే గోపరాజు రమణ పాత్ర బాగా పేలింది. సెకండాఫ్ లో కథకి మరింత బలం చేకూరడానికి ఆయన పాత్ర బాగా హెల్ప్ అయింది. ఒక్క ఫైట్ లేకుండా .. విలన్ లేకుండా .. రెండు కుటుంబాల మధ్యనే లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి కదలకుండా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

మొదటి సినిమానే అయినా బెల్లంకొండ గణేశ్ పాత్రకి తగినట్టుగానే చేశాడు. ఒకవేళ అతనికి నటన కొత్త .. కెమెరా పట్ల కాస్త మొహమాటం ఉన్నప్పటికీ, అవి ఆ పాత్రలో కలిసిపోయాయనే చెప్పుకోవాలి. మంచి ఒడ్డూ పొడుగుతో లుక్ పరంగా కూడా మంచి మార్కులనే కొట్టేశాడు. వర్ష బొల్లమ్మ తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక రావు రమేశ్ .. నరేశ్ .. సుబ్బరాజు .. వెన్నెల కిశోర్ .. హర్షవర్ధన్ .. గోపరాజు రమణ .. ప్రగతి .. సురేఖ వాణి .. దివ్య శ్రీపాద .. ఎవరి పాత్రలో వారు ఇమిడిపోయారు. పాత్రల ఎంపిక కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. 

కథాకథనాలతో పాటు ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది సంగీతం. మహతి స్వరసాగర్ స్వరపరిచిన 'మిల మిల మెరుపులా' .. 'డుం డుం డుం' .. 'నువ్వులేని లోకమే' పాటలు బాగున్నాయి. సాహిత్యం పరంగా కూడా అర్థవంతంగా అనిపిస్తాయి. సూర్య కెమెరా పనితనానికీ .. నవీన్ నూలి ఎడిటింగ్ కి వంకబెట్టవలసిన పనిలేదు. రాఘవరెడ్డి అందించిన సంభాషణలు సందర్భోచితంగా అనిపిస్తాయి. పాత్రలు సహజంగా అనిపించడానికి సంభాషణలు కూడా ఒక కారణంగా కనిపిస్తాయి. సరదాగా మొదలైన కథకి ఇంటర్వెల్ సమయానికి చిక్కుముడి పడిపోవడం .. ఆ ముడిని విప్పుతూ సరదాగా శుభం కార్డు వైపు తీసుకుని వెళ్లడం ఆకట్టుకుంటుంది. 

 కథలో కొత్త పాయింట్ .. కథనంలో ఆసక్తి ఉండేలా చూసుకుంటూ పాత్రలకి తగిన ఆర్టిస్టులను పెట్టుకుంటే, తక్కువ  బడ్జెట్ లో .. తక్కువ లొకేషన్లలో కూడా ఆకట్టుకునే సినిమాలను అందించవచ్చనే విషయాన్ని నిరూపించిన సినిమా ఇది. 'డీజే టిల్లు' తరువాత సితార బ్యానర్ నుంచి వచ్చిన మరో మంచి చిన్న సినిమాగానే 'స్వాతిముత్యం' గురించి చెప్పుకోవాలి. పెద్దగా అంచనాలు లేకుండా మంచి పోటీ సమయంలో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, మౌత్ టాక్ తో వసూళ్ల పరంగా పుంజుకుంటుందేమో చూడాలి.

Movie Name: Swathimuthyam

Release Date: 2022-10-05
Cast: Bellamkonda Ganesh, Varsha Bollamma, Rao Ramesh, Naresh, Subbaraju, Vennela Kishore, Goparaju Ramana
Director: Lakshman K Krishna
Music: Mahathi Swarasagar
Banner: Sitara

Swathimuthyam Rating: 3.00 out of 5

Trailer

More Reviews