ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు: విజయవాడ మేయర్

Related image

విజ‌య‌వాడ‌: తూర్పు నియోజక వర్గ పరిధిలో 17వ డివిజన్ నందు సుమారు రూ.10 లక్షల అంచనాలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి ఆధునికీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయరు బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగరంలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో డివిజన్ పర్యటనలో గుర్తించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థకు సంబందించి రోడ్ కంటే పల్లంగా ఉన్నదా మ్యాన్ హోల్స్ లను ఎత్తు పెంచుట మరియు పాడైన మూతల మార్పిడి వంటి పలు పనులకు శ్రీకారం చుట్టి అండర్ గ్రౌండ్ డ్రెయినేజి సమస్యలను పరిష్కరించుట జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎదురౌతున్న సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ సిద్దంగా ఉందని తెలియజేశారు.

నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా వైసీపీ పాలన: తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్

ప్రజా సమస్యల పరిశీలనలో భాగంగా డివిజన్ స్థాయిలో స్థానిక కార్పొరేటర్లు మరియు ప్రజలు తెలిపిన సమస్యలను మేయర్ కి మరియు సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించేలా తన వంతు కృషి చేస్తున్నాని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అభివృద్ధియే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, అనేక సంక్షేమ పథకముల ద్వారా ప్రజల అవసరాలను తీర్చుటలో రాష్ట్ర ప్రభుత్వం మరియు నగరపాలక సంస్థ అందించు మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులను పరిష్కరించుటలో మేయర్ తోడ్పాటుతో అధికారుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, స్థానిక వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

కొండప్రాంతాలలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలి: నగరపాలక సంస్థ కమిషనర్
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయిలో పర్యటనలో భాగంగా శనివారం విద్యాధరపురం ప్రాంతములోని 44వ డివిజన్ కొండ ప్రాంతాలు, లేబర్ కాలనీ నందు చేపట్టవలసిన అంతర్జాతీయ స్టేడియం ప్రాంతాన్ని మరియు డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నందలి త్రాగునీటి సరఫరా చేయు విధానము పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

44వ డివిజన్ నాలుగు స్థంబాల సెంటర్, రామరాజ్య నగర్, సొరంగం మొదలగు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల తీరును పరిశీలిస్తూ, స్థానిక ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలలో ఎదురౌతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. స్థానికులను చెత్త సేకరణకు మరియు కాలువలు శుభ్రపరచుటకు సిబ్బంది సక్రమముగా వస్తున్నది లేనిది, త్రాగునీటి సరఫరా విధానము మొదలగు అంశాలను అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేస్తూ, కొండ ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానమును అమలు చేయాలని ప్రజారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతములోని మెట్ల మార్గం మరియు ఖాళి ప్రదేశాలలో ఎవరు చెత్త మరియు వ్యర్ధాలు పడవేయకుండా చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత శానిటరీ అధికారులపై ఉందని, ఏవిధమైన చెత్త లేదా వ్యర్దములు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

తదుపరి లేబర్ కాలనీ నందు అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం కొరకు కేటాయించిన స్థలమును పరిశీలించి దానికి సంబందించిన డిజైన్ పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. అదే విధంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా పున్నమి ఘాట్ బాబ్బురి గ్రౌండ్ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు మరియు ఇంకను చేపట్టవలసిన పనుల వివరాలు సంబందిత అధికారులను అడిగి తెలుసుకొని మిగలిన పనులు కూడా సత్వరమే చేపట్టి పూర్తి చేయుటకు తగిన ప్రణాళికలను సిద్దం చేయాలని అన్నారు. అదే విధంగా కుమ్మరిపాలెం సెంటర్ నందలి డి.ఎస్.యం స్కూల్ ను పరిశీలించి పాఠశాల నందలి క్లాస్ రూమ్ ల వివరాలు, విద్యార్ధుల సంఖ్యా, విద్యార్ధులకు అందుబాటులో ఉన్న సదుపాయాల వివరాలు మరియు మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు.
 
తదుపరి డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ప్లాంట్ నందలి 5 యం.జి.డి, 11 యం.జి.డి 8 యం.జి.డి ఫిల్టరైజేషన్ ప్లాంట్లు పని తీరు, వాటర్ ఫిల్టర్ ప్లాంట్ల యొక్క నిర్వహణ విధానము, ఇన్ టెక్ వెల్ ద్వారా రా వాటర్ సేకరణ మరియు 11 యం.జి.డి ఇన్ టెక్ వెల్ ద్వారా నీటి సేకరణ శుద్ధి చేయు విధానము మరియు స్కాడా పనితీరు, ల్యాబ్ నందు వాటర్ టెస్టింగ్ విధానము మరియు రా-వాటర్ శుద్ధి చేసిన తదుపరి నీటిలో గల టేర్భిటి శాతం ఎంత పరిమాణంలో ఉన్నది మరియు క్లోరినేషన్ ఎంత పరిమాణంలో కలుపుతున్నది, అమలులో ఉన్న 24/7 మంచినీటి సరఫరా విధానమును రిజర్వాయర్లకు రక్షిత నీటిని సరఫరా చేయు విధానము, వాటర్ వేస్ట్ జ్ మొదలగు అన్ని అంశాలను క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వేసవిలో ప్రజలకు ఏవిధమైన నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ, వాటర్ పైప్ లైన్ లలో గుర్తించిన లికేజిలకు యుద్దప్రతిపదికన తగిన మరమ్మతులు చేపట్టి త్రాగునీరు వృధా కాకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీత బాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, జోనల్ కమీషనర్ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్, శానిటరీ సూపర్ వైజర్ శివరామప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases