Talasani: జనావాసాల మధ్య ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లపై నిర్ణయం తీసుకుంటాం: మంత్రి తలసాని

  • సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో అగ్నిప్రమాదం
  • ముగ్గురి సజీవదహనం!
  • సంఘటన స్థలాన్ని నేడు కూడా పరిశీలించిన తలసాని
  • భవనం కూల్చివేస్తామని వెల్లడి
  • పక్కన ఇళ్లకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని హామీ
Talasani visits Deccan Sports mall fire accident site

సికింద్రాబాద్ లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయినట్టు భావిస్తున్నారు. అగ్నిప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ ఆ భవనం లోపలికి వెళ్లేందుకు సాధ్యపడడంలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పొగ కారణంగా లోపల ఏమీ కనిపించడంలేదని తెలిపారు. కానీ లోపల ఓ మృతదేహం లభ్యమైంది అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

మంత్రి తలసాని రాంగోపాల్ పేట పరిధిలో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం వద్దకు వచ్చారు. భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించేందుకు అధికారుల శ్రమ ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 25న ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తోందని తలసాని వెల్లడించారు. జనావాసాల మధ్య ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 

ఇక, డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని కూల్చివేస్తామని, పక్కన ఉన్న ఇళ్లకు ఏమైనా నష్టం వాటిల్లితే, ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ భవనం కూల్చివేతకు గతంలో అయ్యప్ప సొసైటీలో భవనం కూల్చివేతకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తలసాని పేర్కొన్నారు.

More Telugu News