BRS: రిమోట్ ఓటింగ్ మెషీన్ పై బీఆర్ఎస్ స్పందన

  • రిమోట్ ఓటింగ్ మెషీన్ ప్రతిపాదన తీసుకువచ్చిన ఈసీ
  • బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్న వినోద్ కుమార్
  • ఆర్ వీఎంలను నమ్మలేమని వ్యాఖ్యలు
  • ఈవీఎంలపై సందేహాలే ఇంకా నివృత్తి కాలేదని వెల్లడి
BRS opines on EC proposed Remote Voting Machine

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్ వీఎమ్) పై బీఆర్ఎస్ పార్టీ తన అభిప్రాయాలు వెల్లడించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. 

ఇప్పుడు ఎన్నికల్లో వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లనే హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని, అలాంటప్పుడు బహుళ నియోజకవర్గాల రిమోట్ ఓటింగ్ మెషీన్లను ఎలా నమ్మాలని వినోద్ కుమార్ ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలనే హ్యాక్ చేయగలుగుతున్నారని, ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో నమోదయ్యే ఓటును ఎలా విశ్వసించగలమని అన్నారు. ఆ ఓటును ఓటరే వేశాడో, లేక హ్యాకింగ్ ద్వారా మరెవరైనా వేశారో తెలుసుకోగలమా? అని సందేహం వ్యక్తం చేశారు. 

మనదేశంలో ఇలాంటి పద్ధతులు అవసరంలేదని భావిస్తున్నామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అసలు, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఈవీఎంలనే పక్కనబెడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్లను తీసుకువచ్చే ప్రయత్నం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News